DOGE: ఎలాన్ మస్క్‌కు షాక్.. డోజ్‌లో పని చేస్తున్న 21 మంది సివిల్ సర్వీస్ ఉద్యోగులు మూకుమ్మడి రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
ఫెడరల్ ఉద్యోగుల తొలగింపులో భాగస్వామ్యం కావడానికి మేము సిద్ధంగా లేమని ప్రకటిస్తూ, ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ సంస్థలో పనిచేస్తున్న 21 మంది సివిల్ సర్వీస్ ఉద్యోగులు మంగళవారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
తమ సాంకేతిక నైపుణ్యాలను కీలకమైన సివిల్ సర్వీస్ ఉద్యోగుల తొలగింపు కోసం ఉపయోగించలేమని స్పష్టం చేశారు.
ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, ప్రొడక్ట్ మేనేజర్లు ఇలా పెద్దఎత్తున ఉద్యోగాలు వదిలివేయడం మస్క్‌తో పాటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కూ షాకింగ్ విషయంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
"మేము అమెరికా ప్రజలకు సేవ చేయడానికి ప్రతిజ్ఞ చేసాము. రాజ్యాంగ విలువలను కాపాడేందుకు తగిన విధంగా పాలనా వ్యవస్థల్లో పని చేయాలని ప్రమాణం చేశాం" అని వీరు సంయుక్త రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
వివరాలు
డోజ్ రద్దు చేసిన ఒప్పందాల్లో 40% వ్యర్థమే
డోజ్‌లో మస్క్ ఆధ్వర్యంలో అధికంగా రాజకీయ ప్రయోజనాలున్న వారే కొనసాగుతున్నారని, కానీ వారిలో నైపుణ్యం లేకపోవడంతో లక్ష్యాలను చేరుకోవడం కష్టమవుతుందని ఆరోపించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రంప్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్, ఇప్పటి వరకు రద్దు చేసిన ఒప్పందాల్లో 40శాతం ఉపయోగంలేనివేనని తేలింది.
ఈ ఒప్పందాల రద్దు వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి లాభం కలగలేదని పరిశీలనలో వెల్లడైంది.
డోజ్ మొత్తం 1,125 ఒప్పందాలను రద్దు చేయగా,వీటిలో 417 ఒప్పందాల రద్దు వల్ల ఎటువంటి ప్రయోజనం కలగలేదని తేలింది.
ఇందుకు ప్రధాన కారణం, ఆ ఒప్పందాలకు సంబంధించిన నిధులు ఇప్పటికే పూర్తిగా ఖర్చు అయిపోవడమేనని అధికారులు తెలిపారు.