
TTP and Baloch attacks: 22 మంది పాక్ సైనికులు మృతి.. పాక్‌పై దాడి చేస్తున్న తాలిబాన్, బలూచిస్తాన్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌తో ఘర్షణ అనంతరం పాకిస్తాన్‌కు మరో పెద్ద సమస్య తలెత్తింది. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) సైనిక స్థావరాలపై తీవ్ర దాడులకు తెగబడింది.
దీంతో పాటు బలూచిస్తాన్ ప్రాంతం నుంచీ తిరుగుబాటుదారులు సైతం పాకిస్తాన్ ఆర్మీపై విరుచుకుపడుతున్నారు.
తాజా దాడుల్లో మొత్తం 22 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్లు సమాచారం. వార్ అబ్జర్వర్ నివేదికల ప్రకారం, గురువారం రాత్రి దక్షిణ వజీరిస్తాన్‌లోని డాంగేట్ చెక్‌పాయింట్‌ను టిటిపి లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది.
ఈ దాడిలో ఏకంగా 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
టిటిపి ఉగ్రవాదులు మొదట లేజర్ రైఫిల్స్‌తో ఆరుగురు సైనికులను హతమార్చి, అనంతరం తేలికపాటి ఆయుధాలతో మిగిలిన వారిపై మెరుపుదాడికి పాల్పడ్డారు.
Details
అదనపు బలగాలను పంపించిన పాకిస్థాన్
ఈ దాడికి స్పందనగా మాంటోయ్ స్థావరం నుంచి పాకిస్థాన్ సైన్యం అదనపు బలగాలను పంపించింది.
కానీ టిటిపి వారు వీరిపైనా పడ్డారు. ఈ ఎదురుకాల్పుల్లో రెండు సైనిక వాహనాలను ధ్వంసం చేశారు. టిటిపి ప్రకారం, ఈ దాడిలో ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.
అయితే తామొక యోధుడు ముసాబ్‌ను కోల్పోయామని వెల్లడించారు. దాడి అనంతరం టిటిపి బలగాలు ఐదు రైఫిళ్లు, ఒక రాకెట్ లాంచర్, నైట్ విజన్ పరికరాలు తదితరాలను స్వాధీనం చేసుకున్నాయి.
ఇదే సమయంలో బలూచ్ తిరుగుబాటుదారులు శుక్రవారం టర్బాట్, క్వెట్టా ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు.
వీటిలో మరో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారం క్రితం క్వెట్టాలో చోటు చేసుకున్న IED పేలుడులో పది మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు.