US Nuclear Weapon: రష్యాలో 300,000 మందిని ఒకేసారి చంపగల అణుబాంబును తయారు చేస్తున్న అమెరికా
ప్రస్తుతం ప్రపంచం దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు వైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుండగా.. మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ మధ్య వార్ నడుస్తోంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో తన ఆధిపత్యానికి నిరంతర ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని అమెరికా మరోసారి అణ్వాయుధాలను వేగంగా అభివృద్ధి చేసే పనిని ప్రారంభించింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశమైన అమెరికా.. కొన్ని సెకన్ల వ్యవధిలో భూమిలోని కొంత భాగాన్ని ధ్వంసం చేయగల అణ్వాయుధాన్ని తయారు చేస్తోంది. శత్రు దేశాలు చైనా, రష్యాను దృష్టిలో ఉంచుకొని అమెరికా ఈ శక్తిమంతమైన అణ్వాయుధాన్ని అభివృద్ధి చేస్తోంది. తాజాగా అమెరికా తయారు చేస్తున్న కొత్త రకం అణుబాంబును ఒకవేళ రష్యా రాజధాని మాస్కోపై పడవేస్తే ఎంత విధ్వంసం జరుగుతుందో తెలియజేసే నివేదికలు బయటకు వచ్చాయి.
హిరోషిమా బంబు కంటే 24 రెట్లు ఎక్కువ శక్తిమంతం
అమెరికా ప్రస్తుతం తయార చేస్తున్న అణ్వాయుధం పేరు 'గ్రావిటీ బాంబ్ B61-13'. ఇది 1945లో హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే 24 రెట్లు ఎక్కువ శక్తిమంతమైనదిని నివేదికలు చెబుతున్నాయి. 1960లో ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అభివృద్ధి చేసిన B61 గ్రావిటీ బాంబుకు అడ్వాన్స్ వెర్షన్‌గా 'గ్రావిటీ బాంబ్ B61-13'ను అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ తయారు చేస్తోంది. చైనా, రష్యాల నుంచి వచ్చే ముప్పును దృష్టిలో ఉంచుకుని అమెరికా దీనిని అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం అమెరికా తయారు చేస్తున్న గ్రావిటీ బాంబు ఎంత శక్తమవంతమైనది అంటే, దీన్ని మాస్కో నగరంపై విడిచినట్లు అయితే.. 300,000 మంది రష్యన్లను ఒకేసారి చంపేస్తుంది.
ఆ బాంబు పడితే.. మైలు దూరంలో ఉన్న వారందరూ చనిపోతారు
B61 న్యూక్లియర్ గ్రావిటీ బాంబు బాంబు పరిమాణం 141 అంగుళాల పొడవు, 13.3 అంగుళాల వ్యాసం ఉంటుందని, దీని బరువు 360 కిలోలు అని బ్రిటీష్ వార్తాపత్రిక 'ది సన్' పేర్కొంది. ఈ బాంబు తయారీని అమెరికా రక్షణ శాఖ కూడా దృవీకరించింది. దేశ భద్రత కోసం ఈ బాంబు అవసరమని అమెరికా సహాయ రక్షణ మంత్రి ప్రకటించారు. ఈ బాంబు పడిన ఒక మైలు దూరంలో ఉన్న ప్రతి ఒక్కరు దీని ధాటికి చనిపోతారు. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి రెండు మైళ్ల దూరంలో ఉన్నవారు అధిక స్థాయి రేడియేషన్ ఎక్స్పోజర్ కారణంగా ఒక నెలలో చనిపోతారు.
అర-మైలు దూరంలోని ప్రతి వస్తువు అగ్నికి ఆహుతై పోతుంది
ఈ బాంబు ప్రభావానికి గురైన వారిలో 15% మంది తరువాత జీవితంలో క్యాన్సర్‌తో మరణిస్తారు. మొత్తం ఈ బాంబా కారణంగా దాదాపు 8,70,000 మంది వరకు ప్రభావితం అవుతారని న్యూక్ మ్యాప్ అధ్యయనం చెబుతోంది. 'గ్రావిటీ బాంబ్ B61-13'బాంబు పడిన ప్రదేశం నుంచి అర-మైలు దూరంలోని ప్రతి వస్తువు అగ్నికి ఆహుతై ఆవిరైపోతుంది. అగ్నిప్రమాదాలు, భవనాలు కూలిపోవడం, గాయాల కారణంగా ఆ ప్రాంతం కొన్నేళ్ల వరకు కోలుకోదని నివేదికలు చెబుతున్నాయి. చైనా, రష్యాల నుంచి ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా ఈ బాంబు తయారీకి అనుమతిచ్చినట్లు అమెరికా రక్షణ శాఖ నివేదిక పేర్కొంది. ఈ కొత్త గ్రావిటీ బాంబును ఆధునిక యుద్ధ విమానాల ద్వారా జారవిడుచుకోవచ్చని అమెరికా డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ తెలిపింది.
బైడెన్ హయాంలో అణుబాంబుల తయారీలో వేగం పెంచిన అమెరికా
గత నాలుగు దశాబ్దాల్లో అమెరికా తన అణుబాంబు నిల్వలను గణనీయంగా తగ్గించుకుంది. ప్రస్తుతం హిరోషిమాపై వేసిన బాంబు కంటే దాదాపు 80 రెట్లు శక్తివంతమైన బాంబు అమెరికా వద్ద ఉంది. ఇదిలా ఉంటే, అణుబాంబుల నిల్వలను తగ్గించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశించగా.. ఆయన తర్వాత అధ్యక్షుడైన ట్రంప్ అణ్వాయుధాల నిల్వలపై ఒబామా ఉత్తర్వులను పక్కన పెట్టేశారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కూడా న్యూక్లియర్ బాంబులను తయారు చేసేందుకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం అమెరికా వద్ద 400-500 బాంబులు ఉన్నాయి. కొన్నేళ్లుగా అణుబాంబు రేసులో అమెరికా వెనుకబడి ఉందని సెనేట్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ మైక్ రోజర్స్ అన్నారు. చైనా, రష్యాలు తమను ఆయుధాల రేసులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.