America: అమెరికా స్కూల్ లో కాల్పుల కలకలం.. నలుగురు మృతి..14 మందికి గాయలు
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. జార్జియా రాష్ట్రంలోని బారో కౌంటీ అపలాచీ హైస్కూల్‌లో బుధవారం ఉదయం కాల్పులు సంభవించాయి. ఈ దాడిలో నలుగురు మరణించగా, కనీసం 14 మంది గాయపడ్డారు. ఈ ఘటన కారణంగా స్కూల్ పరిసరాల్లో భయాందోళనలు వ్యాపించాయి. విద్యార్థులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి స్కూల్ ఫుట్‌బాల్ స్టేడియం వైపు పరుగులు తీశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కాల్పుల సమాచారం అందుకుని హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై జార్జియా గవర్నర్ బ్రియన్ కెంప్ విచారం
ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించారు. ఆకృత్యం చేసిన అనుమానితుడు 14 ఏళ్ల వయస్సులో ఉన్నాడని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు, కానీ అతడు ఆ స్కూల్ విద్యార్థేనా అన్నది ఇంకా స్పష్టత లేదు. ఈ సంఘటన తర్వాత స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు మెసేజ్ ద్వారా దయచేసి ఎవరూ ఘటనా స్థలికి రావద్దని కోరింది. ఈ ఘటనపై జార్జియా గవర్నర్ బ్రియన్ కెంప్ విచారం వ్యక్తం చేస్తూ, దర్యాప్తు అధికారులు తక్షణమే స్పందించడంతో పలువురు విద్యార్థుల ప్రాణాలు నిలిచాయని అన్నారు.
జో బైడెన్‌కు కాల్పుల వివరాలు
అదేవిధంగా, అధ్యక్షుడు జో బైడెన్‌కు ఈ కాల్పుల వివరాలను అందించినట్లు వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. గత రెండు దశాబ్దాల్లో అమెరికాలో పాఠశాలలు, కాలేజీలలో జరిగిన వందలాది కాల్పుల ఘటనలలో ఈ సంఘటన కూడా ఒకటి. 2007లో వర్జీనియా టెక్‌లో జరిగిన కాల్పుల్లో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, ఈ సంఘటనలు అమెరికా తుపాకీ చట్టాలపై తీవ్ర చర్చలకు దారితీశాయి.