Israeli strike: బీరుట్‌లోని భవనంపై ఇజ్రాయెల్ దాడి.. నలుగురు మృతి
ఇజ్రాయెల్, హెజ్‌బొల్లాను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా దాడులను మరింత తీవ్రతరం చేసింది. సోమవారం తెల్లవారుజామున లెబనాన్ రాజధాని బీరుట్‌లోని ఓ నివాస భవనంపై వైమానిక దాడులు జరిపింది. ఆసక్తికరంగా, ఇది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) బీరుట్ నగరంలోని నివాస సముదాయాలపై చేసిన మొదటి దాడి కావడం విశేషం. కోలా ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ భవనంపై ఐడీఎఫ్ బాంబులు వదిలింది. ఈ దాడిలో నలుగురు వ్యక్తులు మృతి చెందినట్లు సమాచారం. ఇంతకుముందు హెజ్‌బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్, ఇప్పుడు నివాస సముదాయాలను లక్ష్యంగా చేయడంతో ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
కోలా ప్రాంతంలో జరిగిన దాడిలో ముగ్గురు మృతి
హెజ్‌బొల్లా ఉగ్రవాదులు తమ ఆయుధాలు, క్షిపణులను నివాస సముదాయాల్లో దాచిపెడుతున్నారని, వాటిని నిర్వీర్యం చేయడమే లక్ష్యమని ఐడీఎఫ్ ప్రకటించింది. పౌరులను ఆ ప్రాంతాల నుంచి ఖాళీ చేయమని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కోలా ప్రాంతంలో జరిగిన దాడిలో తమ సంస్థకు చెందిన ముగ్గురు నాయకులు మృతి చెందినట్లు 'పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా' ప్రకటించింది. అలాగే, ఇజ్రాయెల్ హెజ్‌బొల్లా తో పాటు మరో ఇస్లామిక్ గ్రూప్‌ను కూడా లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.