Shiekh Hasina: షేక్ హసీనాపై నాలుగు కొత్త హత్య కేసులు నమోదు.. మాజీ మంత్రి ఘాజీ అరెస్ట్
బంగ్లాదేశ్‌లో, షేక్ హసీనా ప్రభుత్వంలో భాగమైన మంత్రులు,ఉన్నతాధికారులపై అరెస్టులు, వేధింపులు కొనసాగుతున్నాయి. తాజా పరిణామంలో, హసీనా ప్రభుత్వంలో జౌళి, జ్యూట్ మంత్రిగా ఉన్న గులాం దస్తగిర్ ఘాజీని శనివారం అర్థరాత్రి అరెస్టు చేశారు. ఘాజీని ఢాకాలోని అయన నివాసం నుండి అరెస్టు చేసి, విచారణ కోసం డిటెక్టివ్ బ్రాంచ్ కార్యాలయానికి తరలించారు. ఏ నేరానికి సంబంధించి మాజీ మంత్రి ఘాజీని అరెస్ట్ చేశారనే దానిపై పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు మాజీ ప్రధాని షేక్ హసీనా, ఆమె సహచరులపై నాలుగు కొత్త హత్య కేసుల్లో కేసులు నమోదయ్యాయి.
అబ్దుర్ రహీమ్ మరణానికి సంబంధించి కేసు
హసీనాతో పాటు బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్ ఫోర్స్ మాజీ డైరెక్టర్ జనరల్ అజీజ్ అహ్మద్‌తో పాటు మరో 11 మందిపై ఆదివారం హత్య కేసు నమోదైంది. ఈ కేసు 2010లో బంగ్లాదేశ్ రైఫిల్స్ అధికారి అబ్దుర్ రహీమ్ మరణానికి సంబంధించినది. రహీమ్ తరపు న్యాయవాది కుమారుడు అబ్దుల్ అజీజ్ దరఖాస్తుపై ఢాకా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ మహ్మద్ అఖ్తరుజ్జమాన్ ఆదేశాల మేరకు హసీనాతో పాటు ఇతరులపై కేసు నమోదు చేశారు. ఇది కాకుండా మాజీ ప్రధాని హసీనా తదితరులపై మూడు హత్య కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు హసీనాపై ఇప్పటివరకు 50కి పైగా కేసులు నమోదయ్యాయి.వీటిలో ఎక్కువ శాతం హత్యకేసులే.
ఇషాక్ అలీ మరణం
విద్యార్థి విభాగం మాజీ ప్రధాన కార్యదర్శి ఇషాక్ అలీ ఖాన్ పన్నా బంగ్లాదేశ్ నుండి భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రంలోకి ప్రవేశించినప్పుడు మరణించారు. పన్నా షిల్లాంగ్ సమీపంలోని కొండపై నుంచి జారిపడి అక్కడే గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం.