
అమెరికాలో తుపాకీ కాల్పులు; నలుగురు మృతి, నిందితుడి కోసం గాలింపు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. శనివారం ఉదయం ఓ వ్యక్తి విచక్షణారహితంగా, కాల్పులకు తెగబడ్డాడు.
దీంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన జార్జియా రాష్ట్రంలోని హాంప్టన్ నగరంలో చోటు చేసుకుంది.
ఘటనలో ముగ్గురు పురుషులు సహా ఓ మహిళ మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసమే తీవ్రంగా గాలిస్తున్నామని పోలీసులు ప్రకటించారు.
నిందితుడ్ని ఆండ్రే లాంగ్‌మోర్‌గా గుర్తించామని పోలీసులు వెల్లడించారు. అతని ఆచూకీ తెలిపిన వారికి భారీ మొత్తంలో నజరానా ప్రకటించారు.
పది వేల డాలర్లు రివార్డును ప్రకటిస్తున్నట్లు హాంప్టన్ పోలీసులు తెలిపారు.
DETAILS
2023లో అమెరికాలో ఇది 31వ కాల్పుల ఘటన : పోలీసులు
నిందితుడు ఆండ్రే లాంగ్‌మోర్ అత్యంత ప్రమాదకారి అని పోలీసులు పేర్కొన్నారు. అతడి వద్ద ఆయుధం కూడా ఉందని చెప్పారు.
మరోవైపు ఆండ్రే లాంగ్‌మోర్ ఏ మూల దాక్కున్నా వెంటాడి అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
అగ్రరాజ్యంలో ఈ సంవత్సర కాలంలో ఇప్పటికే ఇలాంటి కాల్పులు 30 జరిగాయని, తాజాగా జరిగింది 31వ ఘటన అని పోలీసులు పేర్కొన్నారు.
మొత్తంగా 153 మంది పౌరులు తూటాలకు బలయ్యారని వివరించారు.
హాంప్టన్ సిటీ దాదాపు 8500 మంది జనాభాను కలిగి ఉంది. ఇక్కడ మోటార్ స్పీడ్ వే సైతం ఉండటంతో నాస్కార్ (కారు రేసులు) ఈవెంట్స్‌కు ఈ నగరం పేరు గాంచింది.