
Turkey: 40 గంటలుగా టర్కీలో విమానాశ్రయంలో ప్రయాణికులు.. సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు
ఈ వార్తాకథనం ఏంటి
లండన్ నుంచి ముంబయికి వెళ్తున్న విమానం టర్కీలో అత్యవసరంగా దిగిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ కారణంగా దాదాపు 40గంటలుగా ప్రయాణికులు విమానాశ్రయంలోనే నిలిచిపోవాల్సి వచ్చింది.
విమానాశ్రయం నగరానికి దూరంగా ఉండటంతో అక్కడ తగిన సదుపాయాలు లేక ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఏప్రిల్ 2న వర్జిన్ అట్లాంటిక్‌కు చెందిన విమానం లండన్ నుండి ముంబయికి బయలుదేరింది.
ఈ విమానంలో 250మందికి పైగా ప్రయాణికులు ఉండగా,వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు.
విమానంలో ఒక్కరికి తక్షణ వైద్య సహాయం అవసరమైన నేపథ్యంలో,విమానం తుర్కియేలోని దియార్‌బకిర్ అనే ప్రాంతంలోని విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసింది.
కానీ ల్యాండింగ్ అనంతరం విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.దీంతో ప్రయాణికులు అక్కడే 40 గంటలకు పైగా నిలిచిపోయారు.
వివరాలు
చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులకు తీవ్ర ఇబ్బందులు
ఎయిర్‌పోర్టులో కనీస సదుపాయాలు కూడా లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఎక్స్ వేదికగ తమ అనుభవాలను షేర్ చేస్తూ కొందరు బాధితులు స్పందించారు.
"ఇంత సమయం గడుస్తున్నా ఎయిర్‌లైన్ అధికారులెవరూ మమ్మల్ని సంప్రదించలేదు", అని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
తినేందుకు సరిపడా ఆహార ప్యాకెట్లు అందుబాటులో లేవని, ఒక్కటే టాయిలెట్ ఉండటంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నామని, ఫోన్ ఛార్జింగ్‌కు కూడా సౌకర్యాలు లేవని తెలిపారు.
చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
తమను త్వరితగతిన ముంబయికి తరలించేలా ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
వివరాలు
ప్రయాణికుల భద్రత మా తొలి ప్రాధాన్యత: వర్జిన్ అట్లాంటిక్ ప్రతినిధి
"ప్రయాణికుల భద్రత మా తొలి ప్రాధాన్యత. ఈ అసౌకర్యానికి మేము క్షమాపణలు చెబుతున్నాం. ఏప్రిల్ 4న మధ్యాహ్నం 12 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) దియార్‌బకిర్ నుండి ముంబయికి ప్రత్యేక విమానం VS1358ను ఏర్పాటు చేస్తాము. అనుమతులు అందని పక్షంలో ప్రయాణికులను బస్సుల ద్వారా మరో విమానాశ్రయానికి తరలించి,అక్కడి నుంచి ముంబయికి పంపిస్తాం. రాత్రివేళ బసకు అవసరమైన ఏర్పాట్లను కూడా చేస్తాం. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం" అని వర్జిన్ అట్లాంటిక్ ప్రతినిధి వెల్లడించారు.
వివరాలు
భారత రాయబార కార్యాలయం స్పందన
తుర్కియే రాజధాని అంకారాలోని భారత రాయబార కార్యాలయం ఈ ఘటనపై స్పందించింది.
వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌లైన్, దియార్‌బకిర్ విమానాశ్రయాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది.
ముంబయికి ప్రయాణికులను తరలించేందుకు మరో విమానం ఏర్పాటుపై సంబంధిత అధికారులతో చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది.