LOADING...
Pakistan: మసీదులో ఆత్మాహుతి దాడి.. 5 మంది మృతి, 20 మందికి గాయాలు
మసీదులో ఆత్మాహుతి దాడి.. 5 మంది మృతి, 20 మందికి గాయాలు

Pakistan: మసీదులో ఆత్మాహుతి దాడి.. 5 మంది మృతి, 20 మందికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 28, 2025
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని అఖోరా ఖట్టక్‌లో ఉన్న దారుల్ ఉలూమ్ హక్కానియా మదర్సాలో శుక్రవారం (ఫిబ్రవరి 28) ప్రార్థనల సందర్భంగా జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 16 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ దాడిలో జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం-సామి (JUI-S) చీఫ్ మౌలానా హమీదుల్ హక్ హక్కానీ మరణించారు. ఆయన, జేఎయూఐ-ఎస్ మాజీ అధినేత, "తాలిబాన్ పితామహుడు"గా పేరొందిన మౌలానా సమియుల్ హక్ కుమారుడు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, మౌలానా హమీదుల్ హక్ హక్కానీ ప్రార్థనల సమయంలో మసీదులోని ముందువరుసలో ఉన్నాడు. అతడే ప్రధాన లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. పేలుడు అనంతరం ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.

వివరాలు 

ఆత్మాహుతి దాడి అని నిర్ధారణ

ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) జుల్ఫికర్ హమీద్ ప్రకారం, ఇది స్పష్టంగా ఒక ఆత్మాహుతి దాడి అని నిర్ధారణ అయింది. ఈ దాడి వెనుక కారణాలను, దానిని చేపట్టిన వ్యక్తులను గుర్తించేందుకు భద్రతా సంస్థలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయని తెలిపారు. హక్కానియా మదర్సా రాడికల్ ఇస్లామిక్ భావజాలానికి కేంద్రంగా ఉండటమే కాకుండా, తాలిబాన్ నాయకులకు విద్యా కేంద్రంగా కూడా పని చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత మొత్తం ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మసీదులో ఆత్మాహుతి దాడి దృశ్యాలు 

వివరాలు 

మౌలానా హమీదుల్ హక్ హక్కానీ ఎవరు? 

ప్రస్తుతం మౌలానా హమీదుల్ హక్ ఎంపీగా కొనసాగుతున్నారు. 2018లో తన తండ్రి మౌలానా సమియుల్ హక్ హత్యకు గురైన తర్వాత, జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం-సామి (JUI-S) నేతగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన తండ్రి సమియుల్ హక్, ఆఫ్ఘన్ తాలిబాన్‌కు కీలక మద్దతుదారుగా నిలిచారు.

వివరాలు 

హక్కానియా మదర్సా చరిత్ర 

1947లో స్థాపించబడిన దారుల్ ఉలూమ్ హక్కానియా, పాకిస్తాన్‌లో అత్యంత ప్రభావశీలమైన ఇస్లామిక్ మదర్సాలలో ఒకటి. దీని స్థాపకుడు మౌలానా అబ్దుల్ హక్ హక్కానీ. ఈ మదర్సా వివాదాస్పద చరిత్రను కలిగి ఉంది. 2007లో పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో కొంతమంది అనుమానితులకు ఈ మదర్సాతో సంబంధం ఉందని ఆరోపణలు వచ్చినప్పటికీ, మదర్సా నిర్వాహకులు ఆ ఆరోపణలను ఖండించారు. బీబీసీ నివేదికల ప్రకారం, ఈ మదర్సాలో చదివిన విద్యార్థులలో చాలామంది ఆఫ్ఘన్ తాలిబాన్‌లో కీలక స్థానాలను అలంకరించారు.

వివరాలు 

పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు

వీరిలో తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి, అబ్దుల్ లతీఫ్ మన్సూర్, హక్కానీ నెట్‌వర్క్ వ్యవస్థాపకుడు ముల్లా జలాలుద్దీన్ హక్కానీ, గ్వాంటనామో బే మాజీ ఖైదీ ఖైరుల్లా ఖైరుఖ్వా వంటి వారు ఉన్నారు. దారుల్ ఉలూమ్ హక్కానియా చాలా కాలంగా పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు, రాడికల్ గ్రూపుల ప్రభావం, భద్రతా సమస్యల నేపథ్యంలో చర్చనీయాంశంగా మారింది. మౌలానా హమీదుల్ హక్ మరణం తర్వాత, ఈ సంస్థ మళ్లీ దృష్టిలోకి వచ్చింది.