Pakistan: పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భారీగా నిరసనలు.. ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది మృతి
పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి విడుదలకు డిమాండ్ చేస్తూ ఆ పార్టీ మద్దతుదారులు చేపట్టిన నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం భారీగా భద్రతా బలగాలను మోహరించింది. ఇస్లామాబాద్, రావల్పిండికి వెళ్లే ప్రధాన రహదారులను మూసివేయడంతో పాటు, రైలు, మెట్రో బస్సు సేవలను కూడా నిలిపివేసింది. నిరసనకారులు పోలీసులపై దాడులకు పాల్పడటంతో ఐదుగురు భద్రతా సిబ్బంది మరణించారని, పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన దాడిలో ఒక పోలీసు అధికారి మృతి చెందారని అధికారులు వెల్లడించారు. 119 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే 22 పోలీసు వాహనాలను దగ్ధం చేశారని తెలిపారు. నిరసనకారులలో నలుగురు మరణించినట్లు సమాచారం.
"ఇమ్రాన్ ఖాన్ విడుదలయ్యాకే మేము వెళ్తాం" : బుష్రా బీబీ
ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ నేతృత్వంలో ఆదివారం ప్రారంభమైన నిరసన ప్రదర్శన సోమవారం ఇస్లామాబాద్‌కు చేరింది. "ఇమ్రాన్ ఖాన్ విడుదలయ్యాకే మేము వెళ్తాం" అంటూ బుష్రా బీబీ వ్యాఖ్యానించారు. నిరసనకారులు బారికేడ్లను తొలగించి రాజధాని వైపు అడుగులు వేస్తుండటంతో పరిస్థితి తీవ్రస్థాయికి చేరుకుంది. పోలీసులు లాఠీచార్జ్ చేపట్టారు. ఇంతకుముందు, 2022 ఆగస్టులో ఇస్లామాబాద్ అబ్బారా పోలీస్‌స్టేషన్‌లో ఇమ్రాన్ ఖాన్, పీటీఐ నేతలపై పబ్లిక్ ఆర్డర్ ఉల్లంఘన కేసు నమోదైంది.
'డీ చౌక్' వద్ద భారీ నిరసనలు
అయితే, ఆ అభియోగాలను కోర్టు కొట్టివేసింది. 2022లో ఆయన ప్రభుత్వం రద్దైనప్పటి నుంచి పలు కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ నిందితుడిగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు రెడ్ జోన్ లోని 'డీ చౌక్' వద్ద భారీ నిరసనలు చేపట్టాలని పీటీఐ నేత అలీ అమీన్ పిలుపునిచ్చారు. ఈ నిరసనలు పాక్‌లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి.