Illegal Immigrants: కేవలం 3 రోజుల్లో 500 మందికి పైగా అక్రమ వలసదారుల అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన డొనాల్డ్ ట్రంప్, అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకున్నారు.
అమెరికా దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, దొంగతనాలు, హింస వంటి చట్టవ్యతిరేక చర్యలలో పాల్గొనే వారిని నిర్బంధించేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఇప్పటికే అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.
తాజాగా ట్రంప్ ఆదేశాల మేరకు, దేశవ్యాప్తంగా 500 మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు.
వందలమందిని దేశం నుంచి వెనక్కి పంపించారు. ఈ విషయాలను శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ వెల్లడించారు.
వివరాలు
అమెరికా ప్రజల రక్షణ కోసం పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం
''ట్రంప్ యంత్రాంగం ఇప్పటి వరకు 538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసింది. వీరంతా ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా, లైంగిక నేరాలు వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారు. అమెరికా చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. సైనిక విమానాల ద్వారా వందలమంది అక్రమ వలసదారులను దేశం నుంచి వెనక్కి పంపించాం. ఎన్నికల సమయంలో ట్రంప్ ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చుతున్నారు,'' అని కరోలిన్ వివరించారు.
ట్రంప్ జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, అమెరికా ప్రజల రక్షణ కోసం పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు.
వివరాలు
దక్షిణ సరిహద్దుల రక్షణ కోసం1,500 మంది సిబ్బంది
''గత నాలుగేళ్లలో అమెరికాలో అక్రమ వలసదారుల సంఖ్య ఎక్కువైంది. లక్షలాది మంది సరైన పత్రాలు లేకుండా సరిహద్దులను దాటి దేశంలోకి ప్రవేశించారు. తరువాత చట్టవ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటూ దేశ భద్రతకు, ప్రజల రక్షణకు ముప్పుగా మారుతున్నారు. అందుకే అక్రమ వలసదారులను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం,'' అని ట్రంప్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
దక్షిణ సరిహద్దుల రక్షణ కోసం ట్రంప్ ఆదేశాల మేరకు 1,500 మంది సిబ్బందిని పంపిస్తున్నట్లు పెంటగాన్ వెల్లడించింది.
మరోవైపు, అమెరికా నుండి అక్రమ వలసదారులను వెనక్కి పంపుతున్న నేపథ్యంలో, మెక్సికో తమ సరిహద్దు రాష్ట్రాలలో శరణార్థుల శిబిరాలను ఏర్పాటు చేస్తోంది.
టెక్సాస్‌లోని ఎల్‌పాసో సరిహద్దుకు ఆనుకుని ఖాళీ స్థలంలో భారీగా శిబిరాలను నిర్మిస్తోంది.