ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం: గాజా ఆసుపత్రిపై దాడి.. 500 మంది మృతి
గాజా సిటీలోని అల్-అహ్లీ హాస్పిటల్‌లో మంగళవారం జరిగిన పేలుడులో వందలాది మంది మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. పేలుడు జరిగిన మొదటి గంట తర్వాత, గాజా సివిల్ డిఫెన్స్ చీఫ్ 300 మంది మరణించారని, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు ఈ సంఖ్యను 500గా పేర్కొన్నాయని రాయిటర్స్ నివేదించింది. వెస్ట్ బ్యాంక్,మిడిల్ ఈస్ట్‌లోని ఇతర ప్రాంతాలలో జరిగిన పేలుడుకు ఇజ్రాయెల్,పాలస్తీనా అధికారులు ఒకరినొకరు నిందించుకుంటున్నారు. దీనికి ఇజ్రాయెల్ వైమానిక దాడులే కారణమని హమాస్ ఆరోపిస్తోంది. ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఇజ్రాయెల్ విమానాలు ఆసుపత్రిపై దాడి చేయలేదని,ఇది ముమ్మాటికీ ఇస్లామిక్ జిహాద్ పనేనంటూ నిందించారు.
శిఖరాగ్ర సమావేశం రద్దు
టర్కీ,ఈజిప్టు దేశాలు ఈ దాడిని ఖండించాయి. ఈ దాడికి ఎవరు బాధ్యులనే దాని గురించి ఎటువంటి సమాచారం లేదని పెంటగాన్ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం ఈ ప్రాంతానికి వెళ్లనున్నారు. హాస్పిటల్ పేలుడు తర్వాత ఆ దేశంతో పాటు ఈజిప్ట్,పాలస్తీనా అథారిటీ నాయకులతో జోర్డాన్‌లో ఆయన ప్రతిపాదించిన శిఖరాగ్ర సమావేశం రద్దు అయ్యినట్లు వైట్ హౌస్ అధికారి తెలిపారు. ఆసుపత్రి పేలుడుకు ముందు, గాజా అధికారులు 10 రోజుల ఇజ్రాయెల్ బాంబు దాడిలో సుమారు 2,800 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు ధృవీకరించారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌లో హమాస్ చేసిన దాడిలో 1,400 మందికి పైగా ఇజ్రాయిలీలు మరణించారు.