ఇండోనేషియాలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు
ఇండోనేషియాలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. సుమత్రా ద్వీపానికి పశ్చిమాన 7.3తీవ్రతతో భారీ ప్రకంపనలు వచ్చినట్లు ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ (బీఎంకేజీ) తెలిపింది. ఈ నేపథ్యంలో ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ సూచన మేరకు అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. ప్రభావిత ప్రాంతంలోని నివాసితులను తీరాలకు దూరంగా వెళ్లాలని కోరారు. సుమారు రెండు గంటల తర్వాత సునామీ హెచ్చరికలను ఎత్తివేశారు.
పడాంగ్‌లో తీవ్రంగా భూకంప ప్రభావం
భూకంపం 84 కిలోమీటర్ల (52.2 మైళ్లు) లోతులో స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు వచ్చినట్లు బీఎంకేజీ తెలిపింది. ఆ తర్వాత పలుమార్లు భూకంపం సంభవించినట్లు అధికారులు చెప్పారు. అధికారులు సుమత్రా పశ్చిమ తీరంలో భూకంప కేంద్రానికి సమీపంలోని ద్వీపాల నుంచి డేటాను సేకరిస్తున్నారని ఇండోనేషియా విపత్తు ఉపశమన ఏజెన్సీ అధికార ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు. పశ్చిమ సుమత్రా రాజధాని పడాంగ్‌లో భూకంపం తీవ్రంగా ఉందని, కొంతమంది బీచ్‌లకు దూరంగా ఉన్నారని పడాంగ్‌లో ఉన్న అబ్దుల్ చెప్పారు.