Bangladesh: బాంగ్లాదేశ్ జైళ్ల నుంచి 700 మంది ఉగ్రవాదులు, నేరగాళ్లు పరార్
బంగ్లాదేశ్‌లో విద్యార్థి ఉద్యమం సమయంలో జైళ్లను బద్ధలు కొట్టడంతో పెద్ద సంఖ్యలో కరుడుగట్టిన ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన నేరస్తులు పరారయ్యారు. వీరిలో 700 మందికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారులు బుధవారం వెల్లడించారు. అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా పై తిరుగుబాటు సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలలో 2,200 మంది ఖైదీలు జైలుల నుండి తప్పించుకున్నారు. ఈ విషయాన్ని జైళ్ల శాఖ చీఫ్ సయీద్ మహమ్మద్ మోతెర్ హోసైన్ ధ్రువీకరించారు. వారిలో దాదాపు 1500 మందిని భద్రతా దళాలు తిరిగి అదుపులోకి తీసుకొన్నాయని ఆయన తెలిపారు. పరారీలో ఉన్న 700 మందిలో 70 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులు, ఉరిశిక్ష పొందిన నేరస్థులు ఉన్నట్లు వెల్లడించారు.
బెయిలు పొందిన ఉగ్రవాదులపై కూడా నిఘా
జులై 19న ఢాకా నగరానికి తూర్పున ఉన్న నార్సింగిలోని జైలు మీద వందల మంది దాడి చేసి, ఆ జైలుకు నిప్పుపెట్టారు. ఈ దాడితో పెద్ద సంఖ్యలో ఖైదీలు విడిపోయారు. ఆ తరువాత, మరో నాలుగు జైళ్లపై కూడా దాడులు జరిగాయి. ఇందులో కషిమ్‌పుర్ జైలు కూడా ఉంది. ఇది కరుడుగట్టిన నేరస్తులను ఉంచే ప్రదేశం. పోలీసు ప్రతినిధి ఇమామ్ హోసైన్ సాగర్ మాట్లాడుతూ, పరారీలో ఉన్న ఖైదీల కోసం తీవ్రంగా గాలిస్తున్నామని చెప్పారు. వీరి వివరాలు దేశంలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు పంపబడినట్లు ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి హసీనా దేశం వీడిన తర్వాత, బెయిలు పొందిన ఉగ్రవాదులపై కూడా తమ నిఘా కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.