ఆఫ్గాన్‌లో భారీ భూకంపం.. వరసగా 5సార్లు ప్రకంపనలు; 14 మంది మృతి
పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భూమి కంపించింది. ఈ విపత్తులో 14 మంది మృతి చెందగా, 78 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. భూమి కంపించిన నేపథ్యంలో కొండచరియలు విరిగిపడడం, భవనం కూలిపోవడం వల్ల మరణాల సంఖ్య మరింత పెరగొచ్చని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. భూకంప కేంద్రం అఫ్గాన్‌లో అతిపెద్ద నగరమైన హెరాత్‌కు వాయువ్యంగా 40 కిలోమీటర్లు (25 మైళ్ళు) ఉందని వెల్లడించింది. 6.3 తీవ్రతతో భూకంపం వచ్చిన తర్వాత వరసగా నాలుగుసార్లు, 5.5, 4.7, 5.9, 4.6 తీవ్రతలతో నాలుగు సార్లు ప్రకంపనలు సంభవించాయి.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
భూకంపం నేపథ్యంలో భవనాలు గోడలు కూలడంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తమ ఆఫీసులో ఉన్న సమయంలో భవనం ఒక్కసారిగా వణికినట్లు 45 ఏళ్ల హెరాత్ నివాసి బషీర్ అహ్మద్ చెప్పారు. ప్రకంపనల నేపథ్యంలో గోడల మధ్య పగుళ్లు రావడం, కొన్ని గోడలు కూలిపోవడం జరిగింది. జాతీయ విపత్తు నిర్వహణ అధికార ప్రతినిధి ఏఎఫ్‌పీ మీడియా సంస్థతో మాట్లాడారు. గ్రామీణ, పర్వత ప్రాంతాల్లో కూడా కొండచరియలు విరిగిపడినందున మృతు సంఖ్య పెరగొచ్చని అంచనా వేశారు. ఇప్పటి వరకు ప్రమాద తీవ్రతపై ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ఈ ఏడాది మార్చిలో, ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్‌లోని జుర్మ్ సమీపంలో సంభవించిన భూకంపం కారణంగా 13 మంది మరణించారు.