Donald Trump: 'హష్ మనీ' కేసులో కొత్త మలుపు.. న్యాయపరంగా ట్రంప్‌కు భారీ ఊరట
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు హష్ మనీ కేసులో ఊరట లభించింది. న్యూయార్క్ కోర్టు ఈ కేసులో శిక్షను నిరవధికంగా వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 'ఈనెల 26న కేసు విచారణ వాయిదా వేయాలంటూ దాఖలైన ఉమ్మడి పిటిషన్‌ను న్యాయమూర్తి జువాన్ మెర్చర్ అంగీకరించారు. ఈ నిర్ణయంతో హష్ మనీ కేసులో ట్రంప్‌కు కీలక విజయం లభించిందని ఆయన కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్ ప్రకటించారు. 2016 ఎన్నికల సమయంలో స్టార్మీ డానియల్స్ నోరు విప్పకుండా ఉండేందుకు ట్రంప్ తన న్యాయవాది ద్వారా 1.30 లక్షల డాలర్ల చెల్లింపులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
శిక్ష నిరవధిక వాయిదా
స్టార్మీ డానియల్స్‌తో ఏకాంతంగా గడిపిన విషయాన్ని ఆమె కోర్టులో స్వయంగా అంగీకరించారు. ఇందులో మొత్తం 22 మంది సాక్షులను కోర్టు విచారించింది. 12 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం అన్ని అభియోగాలను నిజమని తేల్చింది. ఇప్పటికే ట్రంప్ దోషిగా తేలగా, ఈనెల 26న శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. అధ్యక్షుడిగా ఉన్నవారికి క్రిమినల్ విచారణ నుంచి రక్షణ ఉంటుందన్న సుప్రీంకోర్టు పూర్వ తీర్పు నేపథ్యంలో ట్రంప్ న్యాయవాదులు శిక్షను నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించారు. కేసు తీర్పు వాయిదా, శిక్ష నిలిపివేత ఆయనకు అధ్యక్ష పదవీ కాలంలో అతడికి రక్షణ కల్పిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.