మరో చైనా 'గూఢచారి' బెలూన్‌ను గుర్తించిన అమెరికా, డ్రాగన్ వ్యూహం ఏంటి?
మరో చైనా 'గూఢచారి' బెలూన్‌ను అమెరికా గుర్తించింది. లాటిన్ అమెరికా గగన తలంలో ఈ బెలూన్ కనిపించిందని పెంటగాన్ తెలిపింది. అది చైనా బెలూన్ అని తాము అంచనా వేస్తున్నట్లు పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ బ్రిగ్ జనరల్ ప్యాట్రిక్ రైడర్ వెల్లడించారు. అయితే ఆ అనుమానాస్పద బెలూన్ లాటిన్ అమెరికా మీదుగా ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం అమెరికాలోని మోంటానా అణు ప్రయోగ కేంద్రం గగన తలంలో 'గూఢచారి' బెలూన్‌ను చైనా గుర్తించింది. ఒకరోజు తర్వాత చైనాకు చెందిన మరో సర్వేలైన్స్ బెలూన్‌ను గుర్తించినట్లు అమెరికా ప్రకటించడం గమనార్హం.
కొన్ని రోజుల పాటు అమెరికా గగన తలంలోనే బెలూన్: అమెరికా
రెండోసారి గుర్తించిన బెలూన్ ఏ ప్రాంతంలో ఉందో కచ్చితంగా తెలియదు కానీ, అది అమెరికా వైపు వస్తున్నట్లు కనిపించడం లేదని ప్యాట్రిక్ రైడర్ చెప్పారు. అయితే అమెరికాలో గుర్తించిన బెలూన్‌ను ట్రాక్ చేస్తున్నట్లు వివరించారు. అది కొన్ని రోజుల పాటు అమెరికా గగన తలంలోనే ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. అమెరికా పరిసరాల్లో చైనా 'గూఢచారి' వరుసగా కనిపిస్తుండటంతో పెంటగాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. స్పై బెలూన్‌లను పంపడం వెనుక చైనా ఉద్దేశం ఏంటనే దానిపై ఫోకస్ పెట్టింది. త్వరలోనే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటనకు వెళ్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇలాంటి ఘటనలు జరగడం బ్లింకెన్ పర్యటనపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.