అమెరికా అణు ప్రయోగ కేంద్రంపై చైనా 'గూఢచారి' బెలూన్, పెంటగాన్ అలర్ట్
అమెరికాలో చైనా భారీ సాహసానికి ఒడిగట్టింది. మోంటానాలోని అణు ప్రయోగ కేంద్రం గగన తలంలోకి 'గూఢచారి' బెలూన్‌ను పంపి చైనా అడ్డంగా దొరికిపోయింది. ఈ విషయాన్ని అమెరికా సీనియర్ రక్షణ అధికారి ఒకరు నిర్ధారించారు. మాల్మ్‌స్ట్రోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లోని అమెరికా మూడు అణు క్షిపణి ప్రయోగ కేంద్రాల్లో ఒకటైన మోంటానా గగనతలంలో బెలూన్‌ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే అనుమానాస్పద చైనా బెలూన్ ఎగురుతున్న ప్రదేశం చాలా సున్నితమైనది కావడంతో దాని పేల్చడం కానీ, కూల్చడం కానీ సాధ్యం కాదని పెంటగాన్ అధికారులు చెబుతున్నారు. అలా చేస్తే అణు కేంద్రాల్లో విస్పోటనం జరిగిన భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పారు.
అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ చైనా పర్యటనపై ప్రభావం
అమెరికా అణు ప్రయోగ కేంద్రం గగనతలంలో చైనా బెలూన్ దర్శనమివ్వడం ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత సంక్లిష్టం చేసుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలోనే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటనకు వెళ్తున్నట్లు సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడనప్పకీ, ఈ వారాంతంలో పర్యటన ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. అమెరికా గగన తలంలోకి చైనా బెలూన్ రావడం, బ్లింకెన్ పర్యటనపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికా రక్షణకు సంబంధించిన ఫోటోలను సేకరించేందుకు చైనా ఈ 'గూఢచారి' బెలూన్‌ను పంపినట్లు పెంటగాన్ అనుమానిస్తోంది. దేశ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని బెలూన్ సేకరించకుడా నిరోధించేదుకు తమ సైన్యం చర్యలు తీసుకుంటుందని అమెరికా తెలిపింది.