భార్యను భర్త కొట్టడాన్ని సమర్థించిన 80దేశాల్లో 25శాతం మంది ప్రజలు
గత దశాబ్దంలో మహిళా హక్కుల సంఘాలు, సామాజిక ఉద్యమాలు పెరిగినప్పటికీ, ప్రపంచంలో లింగ సమానత్వంలో పురోగతి నిలిచిపోయిందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. దాదాపు 90శాతం మంది వ్యక్తులు(పురుషులు/స్త్రీ) మహిళల పట్ల కనీసం ఏదో ఒక పక్షపాతాన్ని కలిగి ఉన్నారు. అలాగే 10మంది స్త్రీ, పురుషులను తీసుకుంటే అందులో తొమ్మిదిమంది మహిళల పట్ల ఏదో ఒక పక్షపాతాన్ని కలిగి ఉన్నట్లు లింగ సామాజిక నిబంధనల సూచిక (జీఎస్ఎన్ఐ) పేరుతో ఐక్యరాజ్య సమితి డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ఇది గత పదేళ్లలో సాధించిన మహిళల హక్కులు, సమస్యలపై దృష్టి సారించింది. పురుషులు, మహిళలు ఇద్దరిలో పక్షపాత లింగ సామాజిక నిబంధనలు ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉన్నాయని నివేదిక చెప్పింది.
మహిళల కంటే పురుషులే మెరుగైన రాజకీయ నాయకులను తయారు చేస్తారట
ప్రపంచ జనాభాలో కనీసం 85 శాతం ఉన్న 80 దేశాల్లో చేసిన సర్వే ఆధారంగా ఈ నివేదికను తయారు చేశారు. మహిళల కంటే పురుషులే మెరుగైన రాజకీయ నాయకులను తయారు చేస్తారని ప్రపంచ జనాభాలో సగానికి పైగా అంటే 69శాతం మంది నమ్ముతున్నారు. 40శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు మహిళల కంటే పురుషులే మంచి వ్యాపార కార్యనిర్వాహకులని నమ్ముతున్నారని నివేదిక పేర్కొంది. ప్రజాస్వామ్యంలో పురుషులతో సమానమైన హక్కులు మహిళలకు అవసరమని కేవలం 27 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారు. 25శాతం మంది ప్రజలు భర్త తన భార్యను కొట్టడం సమర్థనీయమని నమ్ముతున్నారు. యూనివర్శిటీ విద్య అనేది మహిళల కంటే పురుషులకే ముఖ్యమని 28 శాతం మంది విశ్వసిస్తున్నారు.