LOADING...
Warren Buffett: ట్రంప్‌.. టారిఫ్‌తో చెలగాటమాడుతున్నారు: వారెన్‌ బఫెట్‌ ఆందోళన..!  
ట్రంప్‌.. టారిఫ్‌తో చెలగాటమాడుతున్నారు: వారెన్‌ బఫెట్‌ ఆందోళన..!

Warren Buffett: ట్రంప్‌.. టారిఫ్‌తో చెలగాటమాడుతున్నారు: వారెన్‌ బఫెట్‌ ఆందోళన..!  

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2025
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ప్రమాదకరమని ప్రఖ్యాత పెట్టుబడిదారు వారెన్ బఫెట్ అభిప్రాయపడ్డారు. కెనడా, చైనా, మెక్సికో దేశాలపై భారీ సుంకాలను విధించేందుకు అమెరికా తొలి అడుగు వేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో, బఫెట్ ఈ నిర్ణయాన్ని అప్రమత్తం లేకుండా తీసుకున్న చర్యగా పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత అమెరికా ఆర్థిక వ్యవస్థపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని స్పష్టం చేశారు. ''ఆర్థిక వ్యవస్థ గురించి ఎప్పుడూ అనుకోవాల్సిన విషయం-తరువాత ఏమవుతుంది? మీరు ఎప్పుడూ ఇదే ప్రశ్నించాలి. ఇప్పటి పరిస్థితి చూస్తే,అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది.కానీ నేను దీని గురించి మాట్లాడను, ఎందుకంటే అది కష్టమైన విషయం'' అని బఫెట్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

వివరాలు 

 'బెర్క్‌షైర్ హత్‌వే' 101 బిలియన్ డాలర్ల  పన్ను

94 ఏళ్ల వారెన్ బఫెట్‌ను ప్రపంచంలోని అత్యుత్తమ పెట్టుబడిదారులలో ఒకరిగా గుర్తిస్తారు. ఆయన పెట్టుబడి వ్యూహాలు, మార్కెట్ అంచనాల కోసం లక్షలాది మంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆయన నేతృత్వంలోని 'బెర్క్‌షైర్ హత్‌వే' సంస్థ గత ఆరు దశాబ్దాల్లో అమెరికా ప్రభుత్వానికి 101 బిలియన్ డాలర్లకు పైగా పన్ను చెల్లించింది. ఈ మొత్తం కొన్ని దేశాల స్థూల జాతీయోత్పత్తికి (GDP) సమానంగా ఉంటుందని భావిస్తున్నారు. ట్రంప్ తీసుకున్న తాజా చర్యలతో కెనడా, మెక్సికో, చైనాపై అదనపు సుంకాలు విధించబడ్డాయి. దీనికి ప్రతిగా, కెనడా కూడా అదే తరహాలో ప్రతిస్పందిస్తూ అమెరికా దిగుమతులపై 155 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులకు 25% సుంకం విధిస్తున్నట్టు ప్రకటించింది.

వివరాలు 

 ఆసియా స్టాక్ మార్కెట్లు కుదేలు 

గణాంకాల ప్రకారం, అమెరికా కెనడా, మెక్సికో దేశాల నుండి సుమారు 918 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. ఇక చైనాకూడా దీటుగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది. ముఖ్యంగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను పెంచే అవకాశముందని భావిస్తున్నారు. ట్రంప్ ప్రభావంతో ఆసియా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. జపాన్‌కు చెందిన నిక్కీ సూచీ 1.8% క్షీణించగా, హాంకాంగ్ హాంగ్‌ సెంగ్, ఆస్ట్రేలియా ASX 200 సూచీలు కూడా నష్టపోయాయి. భారతదేశ సెన్సెక్స్ కూడా 300 పాయింట్లకు పైగా పతనమైంది.