భారత్ సాధించిన డిజిటల్ పురోగతి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది: ప్రవాసులను ఉద్దేశించి మోదీ ప్రసంగం
చారిత్రాత్మకమైన అమెరికా పర్యటనను ప్రధాని నరేంద్ర మోదీ ముగించుకున్నారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌లో అమెరికాలోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వీడ్కోలు ప్రసంగం చేశారు. అనంతరం మోదీ అమెరికా నుంచి ఈజిప్టు పర్యటనకు బయలుదేరారు. తొలుత ట్రేడ్ సెంటర్‌లోకి మోదీ రాగానే 'భారత్ మాతా కీ జై', 'వందేమాతరం' నినాదాలు హోరెత్తాయి. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ భవనంలోనే భారతదేశం పూర్తి మ్యాప్ కనిపిస్తోందన్నారు. భారతదేశం నలుమూలల నుంచి ప్రజలను తాను ఇక్కడ చూస్తున్నట్లు చెప్పారు. సమావేశ హాలును మోదీ 'మినీ ఇండియా'గా అభివర్ణించారు. తాను అమెరికాలో అపూర్వమైన ప్రేమ, ఆప్యాయతను పొందినట్లు చెప్పారు.
రక్షణ ఒప్పందాలతో అమెరికా- భారత్ మధ్య భాగస్వామ్యం సుస్థిరం: మోదీ
రక్షణ ఒప్పందాలు అమెరికా- భారత్ మధ్య భాగస్వామ్యాన్ని సుస్థిరం చేస్తాయని ప్రధాని మోదీ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం సాధించిన డిజిటల్ పరివర్తన ప్రవాస భారతీయులను ఆశ్చర్యపరుస్తుందని మోదీ వ్యాఖ్యానించారు. గత కొన్నేళ్లుగా భారతదేశం డిజిటల్ విప్లవాన్ని చూసిన తీరు అపూర్వమైనదన్నారు. నేడు భారతదేశంలో ఎక్కడైనా 24/7 బ్యాంకింగ్ సేవలను పొందుతున్నారన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని, ఆధునిక ప్రజాస్వామ్యానికి యూఎస్ ఛాంపియన్ అని మోదీ పేర్కొన్నారు. రెండు గొప్ప ప్రజాస్వామ్యాల సంబంధాలను బలోపేతం చేయడాన్ని ప్రపంచం గమనిస్తోందన్నారు.
భారతదేశంలో పెట్టుబడులకు ఇదే ఉత్తమ సమయం: మోదీ
భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని పెద్ద టెక్ సంస్థలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారతదేశంలో వీలైనంత ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ఇదే ఉత్తమ సమయం అన్నారు. భారతదేశంలో ఏర్పాటు చేసిన గూగుల్ AI పరిశోధనా కేంద్రం 100 కంటే ఎక్కువ దేశాలో ఉద్యోగులతో పనిచేస్తోందన్నారు. భారత ప్రభుత్వ సహాయంతో హ్యూస్టన్ విశ్వవిద్యాలయంలో తమిళ్ స్టడీస్ చైర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అమెరికా పురోగతిలో ప్రవాసులు కీలక పాత్ర పోషించారన్నారు. ఇప్పుడు భారతీయ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి, దేశ వృద్ధికి సహకరించాలని మోదీ కోరారు. భారత్ నుంచి తీసుకున్న 100పైగా పురాతన వస్తువులను తిరిగి ఇవ్వాలని అమెరికన్ ప్రభుత్వం నిర్ణయించాడాన్ని మోదీ స్వాగతించారు.