Yahya Sinwar: యాహ్యా సిన్వార్ హత్య తర్వాత, హమాస్‌కు ఎవరు నాయకత్వం వహించే అవకాశం ఉంది?
ఇజ్రాయెల్‌తో జరుగుతున్న పోరులో ప్రాణాలు కోల్పోయిన యాహ్యా సిన్వర్(Yahya Sinwar)హమాస్ మిలిటరీ విభాగంలో కీలక వ్యక్తిగా ఉన్నాడు. శత్రువులను అంచనా వేయడంలో అతడికి ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది.ఆయన ఆధ్వర్యంలోనే అక్టోబర్ 7న నాటి దుర్ఘటన చోటుచేసుకుంది.ఇటీవల,బెంజమిన్ నెతన్యాహు సేనలు(IDF)అతడిని మట్టుపెట్టడంతో హమాస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు ఈ మిలిటెంట్ గ్రూప్‌ను ముందుండి నడిపించేది ఎవరు అనే చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో,సిన్వర్ బాధ్యతలను హమాస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మహమ్మద్ అల్ జహర్ స్వీకరించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సిన్వర్ సోదరుడు మహమ్మద్ సిన్వర్ పేరు సైతం ఉన్నట్లు సమాచారం. హమాస్ పొలిటికల్ బ్యూరో సీనియర్ సభ్యులు మౌసా అబుమార్జౌక్,ఖలీల్ అల్‌హయ్యా,ఖలేద్ మషాల్ వంటి పలువురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
మహమ్మద్ అల్ జహర్
ఇతడు హమాస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు. సిన్వర్ మృతితో ఏర్పడిన నాయకత్వ లోటును భర్తీ చేసే వారిలో జహర్ పేరు ముందంజలో ఉంది. ఈ గ్రూప్‌ను సైద్ధాంతికంగా తీర్చిదిద్దడంలో, 2006లో జరిగిన పాలస్తీనియన్ లెజిస్లేటివ్ ఎలక్షన్ తరువాత గాజాలో హమాస్ అధికారంలోకి రావడంలో ఇతడికి కీలకమైన పాత్ర ఉంది. ఆ తర్వాత ఇతడు విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.
మహమ్మద్ సిన్వర్
మహమ్మద్ సిన్వర్ తన సోదరుడి తీరునే అనుసరిస్తూ, హమాస్ మిలిటరీ వింగ్‌లో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నాడు. అతను నాయకత్వ బాధ్యతలు చేపడితే, గ్రూప్ వ్యూహాలు యథావిధిగా కొనసాగుతాయని భావిస్తున్నారు. అయితే, శాంతి చర్చలు మరింత సవాలుగా మారవచ్చని అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దగా కనిపించనందున, ఇజ్రాయెల్ నిర్వహించిన పలు ఆపరేషన్లలో అతను త్రుటిలో ప్రాణాలను కాపాడుకున్నాడు. ప్రస్తుతం, ఇతడి కోసం నెతన్యాహు సేనలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.
మౌసా అబు మార్జౌక్
హమాస్ పాలిటికల్ బ్యూరోలో ఇతను సీనియర్ సభ్యుడిగా ఉన్నాడు. సిన్వర్ మృతిని అనంతరం, హమాస్ నాయకత్వ బాధ్యతలను స్వీకరించబోయే వారి జాబితాలో ఇతడి పేరు ప్రముఖంగా ఉండటం గమనార్హం. హమాస్‌ను స్థాపించడంలో మార్జౌక్ కీలక పాత్ర పోషించాడు. అతను గతంలో గ్రూప్ రాజకీయ ప్రధానిగా పనిచేశాడు. సంస్థాగత, ఆర్థిక, మిలిటెంట్ కార్యకలాపాలలో ఇతడికి చురుకైన పాత్ర ఉంది. చాలా కాలంగా ఇతను బహిష్కరణలో ఉన్నప్పటికీ, హమాస్‌తో సంబంధాలను కొనసాగించడంతో ప్రస్తుతం ఇతడు పోటీదారులలో ఒకరిగా మారాడు.
ఖలీల్ అల్ హయ్యాకి అద్భుతమైన రాజకీయ చతురత
ప్రస్తుతం ఖతర్‌లో ఉన్న ఖలీల్ అల్ హయ్యా, హమాస్ రాజకీయ విభాగంలో ఒక ముఖ్యమైన పాత్రధారి గా ఉన్నాడు. గతంలో జరిగిన ఘర్షణల సమయంలో, కాల్పుల విరమణ చర్చల్లో చురుకుగా పాల్గొన్నాడు. ఇతడికి అద్భుతమైన రాజకీయ చతురత ఉంది మరియు అంతర్జాతీయ మధ్యవర్తులతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందువల్ల, కాల్పుల విరమణ చర్చల్లో ఇతడిని కీలక పాత్రధారి గా పరిగణిస్తున్నారు. గతంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు, అయితే అతని కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోయారు.
ఖలేద్ మాషల్
ఖలేద్ మాషల్.. 2006 నుండి 2017 వరకు హమాస్‌ను నడిపించాడు. అయితే, సిరియన్ సివిల్ వార్ సమయంలో, ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను బహిరంగంగా వ్యతిరేకించడంతో, ఇతనికి ఇరాన్ మద్దతు కోల్పోయాడు. కానీ గ్రూప్‌లో ఇప్పటికీ పట్టు ఉండటంతో, మరోసారి హమాస్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మహమ్మద్ డెయిఫ్.. గ్రూప్ యొక్క సైనిక విభాగాన్ని చూసుకున్నాడు. డెయిఫ్‌ను హతమార్చామంటూ ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. కానీ ఇతడు సజీవంగా ఉండొచ్చనే చర్చా నడుస్తోంది. ఇతడు బతికుంటే, నాయకత్వ పోటీలో ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. మరి ఈ కీలక సమయంలో వీరిలో ఎవరు బాధ్యతలు చేపడతారో తెలియాల్సి ఉంది.