Saudi Arabia: సనాపై సౌదీ వైమానిక దాడులు.. యెమెన్‌లో భారీ పేలుళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
సౌదీ అరేబియా, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. సౌదీ రాజధాని రియాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌పై హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్ దాడికి పాల్పడిన కొన్ని గంటల్లోనే యెమెన్‌పై సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ప్రతీకార దాడులకు దిగాయి. మంగళవారం రాత్రి యెమెన్ రాజధాని సనాపై వైమానిక దాడులు నిర్వహించాయి. దీంతో ఇరు వర్గాల మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సనా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సౌదీ బలగాలు దాడులు చేసినట్లు హౌతీలకు చెందిన అల్-మసిరా టెలివిజన్ వెల్లడించింది. ఈ దాడుల సమయంలో భారీ పేలుళ్లు సంభవించాయని స్థానికులు తెలిపారు. పేలుళ్ల ధాటికి సమీపంలోని ఇళ్ల కిటికీలు సైతం కంపించినట్లు చెప్పారు.
వివరాలు
24 గంటల్లో 72 దాడులు జరిగాయని హౌతీల ఆరోపణ
గత 24 గంటల్లో సౌదీ దళాలు యెమెన్‌పై 72 వైమానిక, క్షిపణి దాడులు జరిపాయని హౌతీ సైనిక ప్రతినిధి యహ్యా సరియా ఆరోపించారు.
ఈ దాడుల్లో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు రియాద్‌లోని ఫైనాన్షియల్ సెంటర్‌లో ఉన్న టవర్లలో ఒకదానిని హౌతీలు డ్రోన్‌తో లక్ష్యంగా చేసుకున్నారని సౌదీ సంకీర్ణ దళాల ప్రతినిధి తుర్కీ అల్-మాలికి వెల్లడించారు.
ఈ దాడిని ఆయన పిరికిపంద చర్యగా అభివర్ణించారు. పౌరులు, వారి ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటున్న హౌతీ తిరుగుబాటుదారులకు తగిన రీతిలో బదులిస్తామని హెచ్చరించారు.
వివరాలు
హౌతీ గ్రూప్‌తో పాటు నలుగురు నేతలపై ఆంక్షలు
మరోవైపు సౌదీ అరేబియాపై జరిగిన డ్రోన్ దాడిని యూఏఈ, బహ్రెయిన్, ఖతార్‌తో పాటు అరబ్ లీగ్ తీవ్రంగా ఖండించాయి.
ఈ ఘటన సౌదీ అరేబియా సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పు కలిగించే చర్యగా పేర్కొన్నాయి.
ఇదిలా ఉండగా, యెమెన్‌లో సైనిక కార్యకలాపాలను పెంచడం, అంతర్జాతీయ నౌకలపై దాడులకు పాల్పడటం వంటి కారణాలతో హౌతీ గ్రూప్‌తో పాటు ఆ సంస్థకు చెందిన నలుగురు నేతలపై ఆంక్షలు విధిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.
అయితే ఈ నిర్ణయాన్ని హౌతీలు తీవ్రంగా వ్యతిరేకించారు. సౌదీ అరేబియా చేస్తున్న నేరాలకు బ్రిటన్ చట్టబద్ధత కల్పిస్తోందని ఆరోపిస్తూ ఆంక్షలను తిరస్కరించారు.
తాజా పరిణామాలతో యెమెన్‌లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి.