Ambedkar : విదేశాల్లో అత్యంత ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం ఎక్కడ ఉందంటే..
భారతదేశం వెలుపల, విదేశాల్లో అత్యంత ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఉత్తర అమెరికాలోని మేరీలాండ్‌లో ఆవిష్కరించారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో దాదాపు 13 ఎకరాల ప్రాంగణంలో నిర్మించారు. అంబేద్కర్ బుద్ధిజం స్వీకరించిన అక్టోబర్ 14న మేరీలాండ్‌లోని ఎకోకీక్ నగరంలో 19 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం కొసమెరుపు. సమానత్వానికి, మానవ హక్కులకు చిహ్నంగా నిలుస్తుందని 'అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ (AIC) వెల్లడించింది. గుజరాత్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్ని రూపొందించిన ప్రముఖ శిల్పి రామ్ సుతర్, అంబేద్కర్ విగ్రహాన్నీ తయారు చేయడం విశేషం.
'ప్రతి పౌరుడు సాధికారత సాధిస్తేనే దేశం ఆర్థిక సంపన్నం అవుతుంది'
భారతదేశంతో పాటు ఇతర దేశాలకు చెందిన దాదాపు 500 మంది ముఖ్యులు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఏఐసీ వివరించింది. 13 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాంగణంలో గ్రంథాలయంతో పాటు కన్వెన్షన్ సెంటర్, బుద్ధ గార్డెన్‌ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంది. ఈ ఆవిష్కరోత్సవానికి భారత్ నుంచి 'దళిత్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (DICCI) అధ్యక్షుడు నర్రా రవి కుమార్ సైతం హాజరయ్యారు. దేశంలోని ప్రతి పౌరుడు సాధికారత సాధిస్తేనే ఆా దేశం ఆర్థికంగా సంపన్నం అవుతుందని అంబేద్కర్ అనేవారని రవి కుమార్ గుర్తుచేశారు. అంబేద్కర్ ప్రతిపాదించిన ఆ ఆర్థిక విధానమే ప్రస్తుతం కార్యరూపం దాలుస్తోందని చెప్పుకొచ్చారు.