మణిపూర్ బాధితులకు అమెరికా సానుభూతి, రాష్ట్ర సర్కారుకు అగ్రరాజ్యం సూచనలు
మణిపూర్‌లో జరుగుతున్న దురాగతాలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఇద్దరు మహిళలపై జరిగిన నగ్న ఊరేగింపు, లైంగిక వేధింపులు, హత్యాచార ఘటనలను క్రూరమైన చర్యగా అభివర్ణించింది. ఇదో భయంకరమైన ఘటనగా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు బాధితులకు అమెరికా సర్కార్ సానుభూతిని ప్రకటించింది. రాష్ట్రంలో మానవ హక్కులను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. గత రెండున్నర నెలల నుంచి కుకీ, మైతేయి వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ కారణంగా ఆ రాష్ట్ర హింసతో అల్లాడిపోతోంది. మే 4న ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించిన ఘటనపై భారత ప్రజలను సిగ్గుతో తలదించుకునేలా చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దేశవ్యాప్తంగా విమర్శలు తీవ్రమయ్యాయి.
ప్రజలను రక్షించేందుకు మానవతా కోణంలో స్పందించాలని అమెరికా సూచన
ఊరేగింపు ఘటనలో నిందితులపై ఉక్కు పాదం మోపాలని దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. అయితే ఈ కేసులో ఇప్పటికే ఓ మైనర్ సహా ఆరుగురిని మణిపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హింస కారణంగా మణిపూర్‌లో దాదాపుగా 125 మందికిపైగా మరణించారు. దాదాపు 40 వేల మందికిపైగా ప్రజలు తమ నివాసాలను విడిచిపెట్టి సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లారు. అల్లర్లను అదుపుచేసేందుకు తక్షణమే శాంతియుతమైన, సమ్మిళిత తీర్మానానికి ప్రోత్సహం అందిస్తామని అమెరికా ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ప్రజలను రక్షించేందుకు మానవతా కోణంలో స్పందించాలని స్థానిక అధికారులను కోరుతున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. మరో వైపు పార్లమెంట్ ఆవరణలో ఇప్పటికే మణిపూర్ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ, నిందితులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని తేల్చిచెప్పారు.