
Iran: ఇరాన్‌పై అమెరికా కఠిన చర్యలు.. పెట్రోలియం, పెట్రోకెమికల్ రంగాలపై ఆంక్షల విస్తరణ
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంగా మారుతుండటంతో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి.
ఈ క్రమంలో అమెరికా ఇరాన్‌పై తన ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఇరాన్ పెట్రోలియం, పెట్రోకెమికల్ రంగాలపై అమెరికా ఆంక్షలను విస్తరించినట్లు ట్రెజరీ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది.
ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ 200 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేయడంతో, దీనికి ప్రతీకార చర్యగా ఈ ఆంక్షలు విధించినట్లు పేర్కొంది.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడికి స్పందనగా, ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ రంగాలకు మద్దతుగా పనిచేస్తున్న 16 సంస్థలు, 17 నౌకలను బ్లాక్ ప్రాపర్టీగా గుర్తించినట్లు ట్రెజరీ పేర్కొంది.
ఈ సంస్థలు ఇరాన్ నేషనల్ ఆయిల్ కంపెనీకి మద్దతుగా చమురు ఉత్పత్తులను రవాణా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
Details
ఇరాన్ పై పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి
ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బోల్లా నేత నస్రల్లా మరణించడంతో, ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడులు జరిపింది.
దీనిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి తీవ్ర విమర్శలు చేయడం, ఇరాన్ తన చర్యలకు మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించడం గమనార్హం.
ఇరాన్ చమురు, అణు స్థావరాలపై ఇజ్రాయెల్ ప్రత్యక్ష దాడులు జరిపే అవకాశాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ఇరాన్‌పై దాడికి ప్రత్యామ్నాయం ఉండాలని సూచించడమే కాకుండా, ఆంక్షలను విస్తరించడం ద్వారా ఇరాన్‌పై మరింత ఆర్థిక ఒత్తిడి పెంచుతున్నట్లు గమనించవచ్చు.