Page Loader
US SENATE : ఆఖరి నిమిషంలో అమెరికాకు తప్పిన షట్‌డౌన్‌ ముప్పు
అమెరికాకు తప్పిన షట్‌డౌన్‌ ముప్పు

US SENATE : ఆఖరి నిమిషంలో అమెరికాకు తప్పిన షట్‌డౌన్‌ ముప్పు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 01, 2023
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రరాజ్యం అమెరికాకు త్రుటిలో షట్‌డౌన్‌ ముప్పు తప్పింది. ఆఖరి నిమిషంలో స్పీకర్‌ కెవిన్‌ మెక్‌ కార్తీ ప్రత్యేక చొరవతో రిపబ్లికన్లతో జరిపిన చర్చలు ఫలితాన్నిచ్చాయి. ఈ మేరకు వార్షిక ద్రవ్య వినిమయ బిల్లుకు చివరి క్షణంలో ఆమోదం లభించడం విశేషం. సదరు బిల్లుకు 335 మంది అనుకూలంగా ఓటు వేయగా, మరో 91 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఈ నేపథ్యంలోనే ఆఖరి నిమిషంలో ప్రతినిధుల సభ(దిగువ)లో ద్రవ్య వినిమయ బిల్లు పాసైంది. ఈ క్రమంలోనే 45 రోజుల పాటు నిధుల మంజూరుకు ఆటంకాలు తొలగిపోయాయి. అగ్రరాజ్యంలో ఆర్థిక చెల్లింపులు జరగాలంటే వార్షిక ద్రవ్య బిల్లు ఆమోదం తప్పనిసరిగా ఉండాల్సిందే.

DETAILS

అమెరికాలో ప్రారంభమైన కొత్త ఆర్థిక సంవత్సరం

అక్టోబర్‌ 1, ఆదివారం నుంచి అమెరికాలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి 12 గంటల లోపు ఈ బిల్లు పాస్ కావాల్సిందే. ఈ మేరకు అక్టోబర్‌ 1న ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్మీ ఉద్యోగులకు వేతనాలు, వివిధ సంక్షేమ పథకాలకు నిధుల విడుదల చేయడం సాధ్యమవుతుంది. ఆర్థిక సంక్షోభాన్ని అదునుగా తీసుకుని జో బైడెన్‌ సర్కారును ఇరకాటంలో పడేయాలని ప్రతిపక్ష రిపబ్లికన్లు అనుకున్నారు. దిగువసభలో మొత్తం 435 మంది సభ్యులు ఉండాల్సింది. ప్రస్తుతం 433 మంది సభ్యులున్నారు. ఇందులో 221 మంది రిపబ్లికన్‌ పార్టీకి, 212 మంది అధికార పార్టీ డెమోక్రాట్లకు చెందిన వారున్నారు. దిగువసభలో ప్రభుత్వానికి ఆధిక్యం లేకపోవడంతో కీలక బిల్లుల ఆమోదానికి డెమోక్రాట్లకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి.