చైనాపై అమెరికా రక్షణశాఖ సంచలన వ్యాఖ్యలు..భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని స్పష్టం
అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ చైనాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. యూఎస్ రక్షణ రంగానికి చైనా సవాలుగా నిలుస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు భారత్‌తో తమ రక్షణ బంధం మరింత బలపడుతుందని స్పష్టం చేసింది. భారతదేశంతో తాము బలమైన రక్షణ బంధాన్ని ఏర్పాటు చేసుకుంటామని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ నిర్ణయించింది. ఈ మేరకు పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ పాట్ రైడర్ ప్రకటించారు. డిఫెన్స్ రంగంలో భారత్‌తో తమ బంధానికి హర్షిస్తున్నామన్నారు. భవిష్యత్ లో ఈ బంధాన్ని మరింత బలపర్చుకునేందుకు దృష్టిపెట్టామన్నారు. ఈ రెండు దేశాలు కలిసి రానున్న రోజుల్లో ఎలా ముందడుగు వేయనున్నాయో మీరు చూస్తారని పాట్ పేర్కొన్నారు.
భారత్ అమెరికా రక్షణ బంధం విలువ 20 బిలియన్ డాలర్లకుపైనే
అమెరికా రక్షణ రంగానికి చైనా ఓ సవాలుగా నిలుస్తోందని పాట్ అన్నారు.మరోవైపు 1997లో భారత్-అమెరికా మధ్య రక్షణ కొనుగోళ్లు చెప్పుకోదగ్గ లేవని, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య 20 బిలియన్ డాలర్లకుపైగా రక్షణ వ్యాపారం కొనసాగుతుందన్నారు. ఇంకోవైపు కెనడా-భారత్ రగడ, ఇండో-అమెరికా సంబంధాలపై చెడు ప్రభావం చూపించాయని ఈ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని గురువారం అమెరికా రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. అమెరికా, భారత్ ప్రజల మధ్య భాగస్వామ్యాన్ని పెంచేందుకు రాయబారి గార్సెట్టి విశేషంగా కృషి చేస్తున్నారని పాట్ ప్రశంసించారు. భారత్‌లోని అమెరికా మిషన్, ఇండియాతో అమెరికాకు ఉన్న కీలక, వ్యూహాత్మక వ్యవహారాలను మరింత మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నట్లు USA ఎంబసీ వివరించడం విశేషం.