Modi France Tour: మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌లో ఫ్రాన్స్ కీలక భాగస్వామి: ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ- ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. భారత్, ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 సంవత్సరాల వేడుకలు వేళ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమాల్లో ఫ్రాన్స్ ముఖ్యమైన భాగస్వామి అని అన్నారు. రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాలు ముఖ్య భూమికను పోషిస్తున్నాయని పేర్కొన్నారు. గత 25ఏళ్ల బలమైన పునాది ఆధారంగా, రాబోయే 25 సంవత్సరాల కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నట్లు మోదీ చెప్పారు. ఇందుకోసం ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలు నిర్దేశించుకోవాలని స్పష్టం చేశారు.
టెక్నాలజీ రంగాల్లో ఇరు దేశాల కొత్త లక్ష్యాలు: మోదీ
భారత్‌కు చెందిన యూపీఐ(UPI)ను ఫ్రాన్స్‌లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరిందని ప్రధాని మోదీ ప్రకటించారు. పునరుత్పాదక శక్తి, గ్రీన్ హైడ్రోజన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్స్, సైబర్, డిజిటల్ టెక్నాలజీ వంటి రంగాలలో సహకారాన్ని పెంపొందించడానికి కొత్త లక్ష్యాలను ఇరు దేశాలు నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌ను ఎగుమతి చేసేందుకు ఇండియన్ ఆయిల్, ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ కంపెనీ మధ్య దీర్ఘకాలిక ఒప్పందం స్వచ్ఛమైన ఇంధన పరివర్తన లక్ష్యాన్ని సాధించడంలో దోహదపడుతుందని మోదీ స్పష్ట చేశారు. అణుశక్తిలో ఇరుదేశాల మధ్య సహకారాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రధాని మోదీ చెప్పారు. చంద్రయాన్-3 విజయవంతంగా ప్రయోగించడాన్ని మోదీ ప్రశంసించారు. భారత్ మొత్త ఈ విజయంతో సంతోషిస్తున్నట్లు చెప్పారు. ఇది భారత శాస్త్రవేత్తల గొప్ప విజయంగా మోదీ అభివర్ణించారు.
యూఏఈ పర్యటనకు మోదీ
ఫ్రాన్స్‌లోని మార్సెయిల్ నగరంలో కొత్త భారత కాన్సులేట్‌ను నిర్మిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ తర్వాత యూఏఈకి వెళ్లారు. ప్రధాని మోదీకి యూఏఈలో శనివారం మధ్యాహ్నం 2.10 గంటలకు ఆ దేశ ప్రభుత్వం లాంఛనప్రాయ స్వాగతం పలకనుంది. అనంతరం ప్రధాని మోదీ యూఏఈకి ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరిపి మధ్యాహ్నం 3.20 గంటలకు విందు భోజనానికి హాజరుకానున్నారు. సాయంత్రం 4.45 గంటలకు మోదీ దిల్లీకి బయలుదేరుతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.