Donald Trump: జమాల్ ఖషోగ్గి హత్యపై ప్రశ్న.. ఏబీసీ రిపోర్టర్‌పై మండిపడిన ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) దాదాపు ఏడేళ్ల తర్వాత అమెరికాలో పర్యటించారు. వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జర్నలిస్టుల సమావేశం జరుగుతుండగా, అక్కడ అనుకోని పరిస్థితి నెలకొంది. ఏబీసీ న్యూస్‌కి చెందిన ఓ రిపోర్టర్ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్యపై ప్రశ్నించడంతో, ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాలు
క్రౌన్ ప్రిన్స్‌కు అనుకూలంగా మాట్లాడిన ట్రంప్
2018లో జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెనుక ఎంబీఎస్ పాత్ర ఉందన్న ఆరోపణలు అప్పట్లో గట్టిగా వినిపించాయి. అమెరికా ఇంటెలిజెన్స్ కూడా ఇదే విషయాన్ని సూచించినట్లు అప్పటి నివేదికలు చెబుతున్నాయి. తాజాగా ఇదే ప్రశ్న ఏబీసీ రిపోర్టర్ అడిగినప్పుడు, ట్రంప్ ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ క్రౌన్ ప్రిన్స్‌కు అనుకూలంగా మాట్లాడారు. "మీరు ప్రశ్నిస్తున్న ఆ విషయం చాలామందికి నచ్చని ఒక విషయమే.జరిగేది జరిగిపోయింది.క్రౌన్ ప్రిన్స్‌కి ఇందులో పాత్ర ఏమీ లేదు. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అతిథిని ఇబ్బంది పెట్టే విధంగా ప్రశ్నలు వేయడం సరికాదు" అంటూ రిపోర్టర్‌పై మండిపడ్డారు. అంతటితో ఆగకుండా, ఆ ఛానల్‌కు అమెరికా లైసెన్స్‌ను రద్దు చేయాలని కూడా వ్యాఖ్యానించారు.
వివరాలు
సౌదీ-అమెరికా సంబంధాల్లో పెద్ద దౌత్య ఉద్రిక్తత
రిపోర్టర్‌ను 'నకిలీ వార్తలు' ప్రచారం చేస్తున్నారని కూడా తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రశ్నపై స్పందించిన ఎంబీఎస్ మాత్రం ఖషోగ్గి హత్య బాధాకరమైన ఘటన అని పేర్కొన్నారు. ట్రంప్ మొదటి పదవీకాలంలో జరిగిన ఈ ఖషోగ్గి ఘటన సౌదీ-అమెరికా సంబంధాల్లో పెద్ద దౌత్య ఉద్రిక్తతను తెచ్చింది. ఇప్పుడు ఆ సంబంధాలను మరింత బలపర్చాలన్న ప్రయత్నాల్లో భాగంగా ట్రంప్ తిరిగి ముందుకు వస్తున్నట్టు కనిపిస్తోంది. ఎంబీఎస్ పర్యటనలో ఇరుదేశాల మధ్య అనేక ముఖ్య ఒప్పందాలు కుదిరాయి. అమెరికాలో 1 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సౌదీ అంగీకరించింది. అదనంగా, ఎఫ్-35 యుద్ధవిమానాలను సౌదీకి అమ్మబోతున్నట్టు ట్రంప్ ప్రకటించారు.
వివరాలు
ఎంబీఎస్ గౌరవార్థం ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ప్రత్యేక విందు
ఎంబీఎస్ గౌరవార్థం ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకు ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, తన చిన్న కుమారుడు బారన్ ట్రంప్ రొనాల్డోకు పెద్ద ఫ్యాన్ అని తెలిపారు.