Loading...
Israel Hamas Conflict: హమాస్‌కు మరో ఎదురుదెబ్బ.. కీలక కమాండర్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్
హమాస్‌కు మరో ఎదురుదెబ్బ.. కీలక కమాండర్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్

Israel Hamas Conflict: హమాస్‌కు మరో ఎదురుదెబ్బ.. కీలక కమాండర్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2026
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

హమాస్‌ కీలక కమాండర్‌ను తమ సైన్యం హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. 2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడిలో కీలక పాత్ర పోషించిన సమీర్‌ అబూ యూనిస్‌ శనివారం నిర్వహించిన దాడిలో మరణించినట్లు హమాస్‌ కూడా ధ్రువీకరించింది. ఈ మేరకు ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌ సైన్యం, అంతర్గత భద్రతా సంస్థ షిన్‌బెట్‌ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

వివరాలు

అల్‌-మవాసీలో లక్ష్యంగా చేసుకుని దాడి

మరోవైపు హమాస్‌ సాయుధ విభాగం అల్‌-ఖస్సామ్‌ బ్రిగేడ్స్‌ కూడా యూనిస్‌ మరణాన్ని ధ్రువీకరించింది. ఈ విషయాన్ని టెలిగ్రామ్‌ ద్వారా వెల్లడించింది.

శనివారం సాయంత్రం జరిగిన దాడిలో యూనిస్‌ మరణించినట్లు పేర్కొంది. 2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడికి ప్రణాళిక రచించడం, దాన్ని పర్యవేక్షించడంలో అత్యంత కీలకమైన కమాండర్లలో యూనిస్‌ ఒకరని తెలిపింది.

ఖాన్‌ యూనిస్‌కు పశ్చిమాన ఉన్న అల్‌-మవాసీ ప్రాంతంలో యూనిస్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ భద్రతా అధికారి ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు వెల్లడించారు.

హమాస్‌ అల్‌-ఖస్సామ్‌ బ్రిగేడ్స్‌లోని రఫా బ్రిగేడ్‌ కమాండర్‌గా యూనిస్‌ వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.

గాజా పౌర రక్షణ విభాగం అధికార ప్రతినిధి మహమూద్‌ బస్సల్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

వివరాలు

దాడిలో మరో ఇద్దరికి గాయాలు

53 ఏళ్ల యూనిస్‌ మృతదేహాన్ని తమ సంస్థ స్వీకరించినట్లు మహమూద్‌ బస్సల్‌ తెలిపారు. దక్షిణ గాజాలో జరిగిన ఈ దాడిలో మరో ఇద్దరు గాయపడినట్లు వెల్లడించారు.

కాల్పుల విరమణ ఒప్పందంపై కొనసాగుతున్న వివాదం

2023 అక్టోబర్‌ 7న హమాస్‌ ఇజ్రాయెల్‌పై జరిపిన దాడితో ఇరుపక్షాల మధ్య యుద్ధం ప్రారంభమైంది.

ఈ పోరు రెండేళ్లపాటు కొనసాగింది. చివరకు 2025 అక్టోబర్‌లో యుద్ధానికి ముగింపు పలుకుతూ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది.

అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని ఇజ్రాయెల్‌, హమాస్‌ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

ADVERTISEMENT