Israel Hezbollah War: హిజ్బుల్లాకు మరో గట్టిషాక్... నస్రల్లా వారసుడు హతం
ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థపై తీవ్రమైన దాడులను చేస్తోంది. రాజధాని బీరూట్‌పై వైమానిక దాడులతో పాటు, దక్షిణ లెబనాన్ ప్రాంతాల్లో భూతల దాడులు కూడా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 2000కి పైగా హిజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇజ్రాయిల్ గత వారం హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని బీరూట్ వైమానిక దాడుల్లో హతమార్చిన విషయం తెలిసిందే. హసన్ నస్రల్లా మరణించిన వెంటనే హిజ్బుల్లా చీఫ్‌గా ఉన్న హషీమ్ సఫీద్దీన్ కూడా ఇజ్రాయిల్ దాడుల్లో మరణించినట్లు సౌదీ వార్తా సంస్థ అల్ హదత్ తెలిపింది.
ఇజ్రాయెల్ దాడుల్లో నఫీద్ధీన్ మృతి
దక్షిణ బీరూట్‌లో జరిగిన వైమానిక దాడుల్లో సఫీద్దీన్ హతమయ్యాడు. హిజ్బుల్లా నాయకులు భూగర్భ బంకర్‌లో సమావేశమవుతున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలిసింది. ఇజ్రాయిల్ దాడుల్లో హిజ్బుల్లా ప్రధాన నాయకులు ఒక్కొక్కరుగా హతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ మిలిటరీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. హిజ్బుల్లా నేత సఫీద్దీన్‌ను 2017లో యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఉగ్రవాదిగా ప్రకటించింది. హిజ్బుల్లా కొత్త నాయకత్వం మరింత దెబ్బతిని, ఇజ్రాయిల్ దాడుల నుంచి తేరుకోలేని పరిస్థితికి చేరుకుంది.