
BLA: పాక్‌కు మరో ఎదురు దెబ్బ.. 39 ప్రాంతాల్లో బలూచిస్థాన్ మెరుపుదాడులు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌పై బలూచిస్థాన్ వేర్పాటువాదుల పోరాటం మరింత ముదిరుతోంది. ఇప్పటికే భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, మరోవైపు బలూచిస్థాన్ నుంచి సైనిక స్థాయిలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
స్వతంత్ర బలూచిస్థాన్ కోసం అక్కడి ప్రజలు తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) మరింత దూకుడు పెంచింది.
ఇటీవలి కాలంలో క్వెట్టా సహా పలు కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు బీఎల్‌ఏ ఇప్పటికే ప్రకటించింది.
తాజాగా మరోసారి ఉగ్రవాదుల్లా కాకుండా ఆత్మగౌరవ యోధుల్లా చొరబడిన BLA, బలూచిస్థాన్ వ్యాప్తంగా ఏకంగా 39 ప్రాంతాల్లో మెరుపుదాడులు నిర్వహించినట్లు శనివారం వెల్లడించింది.
కాలత్ జిల్లా మంగోచర్ పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించింది.
Details
బందీలుగా పోలీసులు
పోలీసు స్టేషన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన BLA, పలు పోలీసులను బందీలుగా చేసుకున్నట్లు పేర్కొంది.
రహదారులను దిగ్బంధించిన ఈ సంస్థ, పాక్ ఆర్మీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
పాక్ మిలిటరీ కాన్వాయ్‌లపై మరిన్ని దాడులు జరిపే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించిన BLA, ఈ ఉద్యమాన్ని పూర్తిగా విస్తృతం చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చింది.
ప్రస్తుతం భారత్ సైన్యం ఒకవైపు, బలూచిస్థాన్ యోధులు మరోవైపు ఉండటంతో పాకిస్థాన్ తీవ్రంగా ఒత్తిడికి గురైంది.
ఈ పరిస్థితుల్లో తమపై జరుగుతున్న దాడులకు ఎలా స్పందించాలో అర్థం కాక పాక్ ప్రభుత్వం తల్లడిల్లుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాజీకి సిద్ధమంటూ పాక్ ప్రభుత్వంలో కీలక మంత్రులే సంకేతాలు ఇస్తుండడం గమనార్హం.