Page Loader
Asim Munir: పాకిస్తాన్‌లో మరో సైనిక తిరుగుబాటు? ఆసిఫ్ అలీ జర్దారీ స్థానంలో అధ్యక్షుడిగా ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్? 
ఆసిఫ్ అలీ జర్దారీ స్థానంలో అధ్యక్షుడిగా ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్?

Asim Munir: పాకిస్తాన్‌లో మరో సైనిక తిరుగుబాటు? ఆసిఫ్ అలీ జర్దారీ స్థానంలో అధ్యక్షుడిగా ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్? 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2025
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.అక్కడ పరిస్థితులు వేగంగా మారిపోతుండటంతో, మళ్లీ సైనిక తిరుగుబాటు జరుగనుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి ఆసిఫ్ అలీ జర్దారీని పదవి నుండి తప్పించి, తనను అధ్యక్ష పదవిలోకి రావాలని ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఎత్తుగడలు వేస్తున్నారని విశ్వసనీయ సమాచారం చెబుతోంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం,జర్దారీ స్థానంలో జనరల్ ఆసిమ్ మునీర్ స్వయంగా తనను నియమించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది చట్టబద్ధంగా జరుగుతుందా లేక బలవంతంగా జరిపే చర్యల ద్వారా జరిగే మార్పా అనేది స్పష్టత లేదు. ఇదే తరహాలో గతంలో,1977 జూలై 5న సైనిక తిరుగుబాటు జరిగిన సందర్భానికి నేటితో 47 ఏళ్లు పూర్తవుతున్నాయి.

వివరాలు 

 పాక్ లో మరోసారి సైనిక తిరుగుబాటు 

ఆ తిరుగుబాటులో జనరల్ జియా ఉల్ హక్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ రోజు జరిగిన సంఘటనల్ని ఇప్పుడు మళ్లీ గుర్తు చేస్తూ, ప్రస్తుత పరిస్థితులు కూడా అప్పటిలాగే ఉన్నాయని పాకిస్తాన్ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో మరోసారి సైనిక తిరుగుబాటు జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయంటున్నారు. జర్దారీకి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయమని కొంత గడువు ఇవ్వడం లేదా నేరుగా సైనికంగా అతన్ని గద్దె దించేయడం.. ఈ రెండింటిలో ఏదో ఒకటి సమీప భవిష్యత్తులో జరిగే ప్రమాదమని ప్రఖ్యాత జర్నలిస్ట్ సయ్యద్ హెచ్చరించారు. ఆయన ప్రకారం, జనరల్ మునీర్ ఇప్పటికే అధ్యక్ష పదవిని తనకు కట్టబెట్టేందుకు పక్కా వ్యూహాలను అమలు చేస్తూ ఉన్నారని తెలుస్తోంది.

వివరాలు 

జనరల్ మునీర్‌పై తీవ్ర విమర్శలు చేసిన బిలావల్ భుట్టో జర్దారీ

ఇటీవల బిలావల్ భుట్టో జర్దారీ ఒక అంతర్జాతీయ మీడియా ఇంటర్వ్యూలో జనరల్ మునీర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాక, హఫీజ్ సయీద్, మసూద్ అజార్‌లను భారత్‌కు అప్పగించడంలో ఎలాంటి అభ్యంతరాలు ఉండకూడదని అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. బిలావల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హఫీజ్ సయీద్ కుమారుడు బహిరంగంగా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలు పాక్ రాజకీయ, భద్రతా వ్యవస్థల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. దీంతో పాకిస్తాన్ సమాజంలో తిరుగుబాటును వ్యతిరేకించే అభిప్రాయాలు కొత్తగా వెలువడుతున్నాయి. రాబోయే రోజుల్లో సైనిక జోక్యం జరిగితే, అది తీవ్ర వ్యతిరేకతకు గురవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

రాబోయే రోజుల్లో పాక్ లో రాజకీయాలు ఊహించని మలుపులు

జనరల్ మునీర్ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు తెరవెనుక కుట్రలు పన్నుతున్నారని జర్నలిస్ట్ సయ్యద్ ఆరోపించారు. దీనితో పాటు, ఈ నేపథ్యంలో షరీఫ్ కుటుంబం పాత్రపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఇప్పటికీ వారి నేరుగా సంబంధం ఉన్నట్లు ఎటువంటి నిర్ధారణ లేదు. బ్యాక్ డోర్ ఒప్పందాలు, వేగంగా మారుతున్న రాజకీయ సన్నివేశాలు పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థను మరోసారి ఒత్తిడిలోకి నెట్టేశాయి. దేశ పరిస్థితి అస్థిరంగా మారుతోంది. రాబోయే రోజుల్లో పాక్ రాజకీయాలు ఊహించని మలుపులు తిరిగే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.