నన్ను పదేళ్లపాటు జైలులో పెట్టేందుకు ఆర్మీ కుట్ర: ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు
దేశద్రోహ చట్టం కింద తనను పదేళ్లపాటు జైలులో పెట్టేందుకు పాకిస్థాన్ ఆర్మీ కుట్ర పన్నిందని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య బుష్రా బేగంను కూడా దేశద్రోహ చట్టం కింద జైలులో పెట్టాలని అనుకుంటున్నారని, అలా చేయడం ద్వారా తనను మరింత అవమానించాలనుకుంటున్నారని ఇమ్రాన్ ట్వీట్ చేశారు. లాహోర్‌లోని తన ఇంట్లో ఖాన్ పీటీఐ నాయకుల సమావేశం అనంతరం ఇమ్రాన్ ఈ ట్వీట్లు చేశారు. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం 100 కంటే ఎక్కువ కేసుల్లో బెయిల్‌పై ఉన్నారు.
చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతా
తనను మళ్లీ అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ప్రజలు బయటకు రాకుండా వారిలో భయాన్ని కలిగిస్తున్నారని ఇమ్రాన్ అన్నారు. తనను మళ్లీ అరెస్ట్ చేసే క్రమంలో మళ్లీ ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తారని, సోషల్ మీడియాను నిషేదిస్తారని చెప్పారు. పోలీసులు సిగ్గు లేకుండా తమ కార్యకర్తల ఇళ్లలోని మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో పాకిస్థాన్ ప్రజలకు ఇమ్రాన్ ఖాన్ ఒక సందేశాన్ని కూడా పంపారు. తన చివరి రక్తపు బొట్టు వరకు హకీకీ ఆజాదీ కోసం పోరాడతాను ఎందుకంటే ఈ మోసగాళ్లకు బానిసలుగా ఉండటం కంటే నాకు మరణమే శ్రేయస్కరమన్నారు. భయానికి నమస్కరిస్తే మన భవిష్యత్ తరాలకు అవమానమని, అన్యాయం, అడవి చట్టాలు ఎక్కువ కాలం జీవించలేవన్నారు.