Israel-Hamas: గాజాలో పాఠశాలలపై దాడి.. 69 మంది మృతి
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం గాజా స్ట్రిప్‌లో తీవ్రంగా కొనసాగుతోంది. ఇజ్రాయెల్ వరుస దాడుల ద్వారా పాలస్తీనా పౌరులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. తాజాగా గాజా స్ట్రిప్‌లోని నాలుగు పాఠశాలలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో 69 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, అనేకమంది గాయపడినట్లు తెలిసింది. గాయపడినవారిలో ముగ్గురు జర్నలిస్టులు, ఐదుగురు పాలస్తీనా పౌర రక్షకులు ఉన్నారు. గాయపడినవారిలో అల్ జజీరా కెమెరామెన్ అహ్మద్ అల్-లౌహ్ కూడా ఉన్నారని తెలియచేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆదివారం ఫోన్‌లో కీలక చర్చలు జరిపినట్లు వెల్లడించారు.
గతేడాది ఇజ్రాయెల్ పై భారీ దాడి
ట్రంప్ గత ఎన్నికల ప్రచారంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్-నెతన్యాహు చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతేడాది అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై భారీ దాడి జరిపింది. ఆ దాడిలో 1,200 మంది మరణించారు. 251 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందిని బందీలుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేపట్టింది. టెల్ అవీవ్ దాడులతో ఇప్పటి వరకు 44,000 మంది పాలస్తీనా పౌరులు మృతిచెందినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి.