Qatar: ప్రపంచ గ్యాస్ కేంద్రంపై దాడి.. ఖతార్‌కు షాక్
ఈ వార్తాకథనం ఏంటి
ఖతార్ ఈశాన్య ప్రాంతంలో ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న రాస్ లాఫాన్ నగరం ఇప్పుడు ప్రపంచ గ్యాస్ వాణిజ్యానికి కేంద్రబిందువుగా మారింది. కేవలం రెండు దశాబ్దాల్లోనే ఇది లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) పరిశ్రమకు గ్లోబల్ హబ్‌గా ఎదిగింది. అయితే తాజాగా ఇరాన్ ఈ ప్రాంతంలోని గ్యాస్ మౌలిక సదుపాయాలపై దాడి చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లు కుదేలయ్యాయి. ఖతార్ రాజధాని దోహాకు ఈశాన్యంగా సుమారు 80కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్ర తీరంలో రాస్ లఫాన్ నగరం ఉంది. వ్యూహాత్మక భౌగోళిక స్థానం కారణంగా ఆసియా, ఐరోపా దేశాలకు ఎగుమతులకు ఇది అత్యంత అనుకూలంగా మారింది. ఒకప్పుడు ముత్యాల వేట, చేపల వేటపై ఆధారపడిన ఈ ప్రాంతం ఇప్పుడు భారీ పారిశ్రామిక కేంద్రంగా రూపాంతరం చెందింది.
వివరాలు
లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఉత్పత్తి జరుగుతోంది
1971లో ఖతార్ నార్త్ ఫీల్డ్ అనే విస్తారమైన గ్యాస్ క్షేత్రాన్ని కనుగొంది. ఇది ఇరాన్‌తో పంచుకున్న గ్యాస్ నిల్వ. ఖతార్ వైపు దీనిని నార్త్ ఫీల్డ్ (నార్త్ డోమ్)గా, ఇరాన్ వైపు సౌత్ ఫార్స్‌గా పిలుస్తారు. ఇక్కడ ప్రధానంగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఉత్పత్తి జరుగుతోంది. ఈ క్షేత్రాన్ని ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల హెచ్చరించడం గమనార్హం. 1980లలోనే ఖతార్ పాలకులు గ్యాస్ ఆధారంగా దేశ ఆర్థిక వ్యవస్థను మార్చాలనే దిశగా దార్శనిక నిర్ణయం తీసుకున్నారు. ముడి గ్యాస్‌ను విక్రయించడం కంటే ప్రాసెస్ చేసి ఎల్‌ఎన్‌జీగా మార్చి ఎగుమతి చేయాలని నిర్ణయించారు.
వివరాలు
భారీ పారిశ్రామిక హబ్‌గా రాస్ లఫాన్ అభివృద్ధి
అప్పట్లో ఎల్‌ఎన్‌జీ భవిష్యత్తుపై స్పష్టత లేకపోయినా, భారీ పారిశ్రామిక హబ్‌గా రాస్ లఫాన్‌ను అభివృద్ధి చేశారు. ఖతార్ ఎనర్జీ ఆధ్వర్యంలో జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేసి, డజన్ల కొద్దీ ఎల్‌ఎన్‌జీ ప్రాసెసింగ్ యూనిట్లు (ట్రెయిన్లు) నిర్మించారు. భారీ స్టోరేజ్ ట్యాంకులు, ఎగుమతి టెర్మినళ్లు, ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ క్యారియర్లను నిలిపే సామర్థ్యం ఉన్న ఆధునిక పోర్టును కూడా అభివృద్ధి చేశారు. 1996లో మొదటి ఎల్‌ఎన్‌జీ షిప్‌మెంట్ జపాన్‌కు వెళ్లడంతో రాస్ లఫాన్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 2000 నాటికి ఖతార్ ఆర్థిక వ్యవస్థకు కీలక కేంద్రంగా మారిన ఈ నగరం, 2010 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద పారిశ్రామిక నగరాల్లో ఒకటిగా ఎదిగింది.
వివరాలు
ఖతార్‌తో దీర్ఘకాలిక ఒప్పందం
ప్రస్తుతం ఇక్కడ సంవత్సరానికి సుమారు 77 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తి జరుగుతోంది. ఇక్కడి నుంచి 30కి పైగా దేశాలకు గ్యాస్ ఎగుమతి అవుతోంది. జపాన్, దక్షిణ కొరియా, భారత్, ఐరోపా సమాఖ్య దేశాలు ప్రధాన దిగుమతిదారులు. భారత్ అవసరాల్లో దాదాపు 40-47 శాతం ఎల్‌ఎన్‌జీ ఖతార్ నుంచే వస్తోంది. 1999లో పెట్రోనెట్ ఎల్ఎన్జి ఖతార్‌తో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే 2024లో భారత్-ఖతార్ మధ్య 78 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం 2028 నుంచి 20 సంవత్సరాల పాటు ఏటా 7.5 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జీ సరఫరా చేయనున్నారు.
వివరాలు
భారత్‌కు గ్యాస్ రవాణా ఖర్చు కూడా తక్కువ
భారత్‌లో విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల తయారీ, పరిశ్రమలు, గృహ వినియోగంలో ఖతార్ గ్యాస్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడి నుంచి భారత్‌కు గ్యాస్ రవాణా ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. అయితే తాజాగా రాస్ లఫాన్‌పై ఇరాన్ క్షిపణి దాడి జరగడంతో ఈ కీలక గ్యాస్ కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావం భవిష్యత్తులో భారత్ ఎల్‌ఎన్‌జీ సరఫరాపై పడే అవకాశం ఉందని, గ్యాస్ కొరత మరింత పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి.