Ontario Gurudwara Committee: కెనడాలో హిందూ దేవాలయాలపై దాడుల వెనుక భారత నిఘా సంస్థల హస్తం: ఓజీసీ
కెనడాలో ఇటీవల హిందూ దేవాలయాలపై దాడులు జరిగిన విషయంలో అంటారియో గురుద్వారా కమిటీ(ఓజీసీ) సంచలన ఆరోపణలు చేసింది. తొలుత ఆలయాలపై దాడులను ఖండించింది. హిందూఫోబియా ఆరోపణలను బలపరుస్తూనే ఆలయాలపై దాడుల విషయంలో ఓజీసీ అనుమానాలను వ్యక్తం చేసింది. కెనడాలో సిక్కు సమాజాన్ని కించపరిచేలా భారత నిఘా సంస్థల ఆదేశాల మేరకు హిందూ దేవాలయాలపై దాడులు జరిగి ఉంటాయని ఓజీసీతోపాటు సిక్కు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈమేరకు ఓజీసీ ప్రకటనను విడుదల చేసింది. ఒట్టావా ఎంపీ చంద్ర ఆర్య బ్రాంప్టన్‌లో జరిగిన విధ్వంసక చర్య విషయంలో ఎటువంటి ఆధారాలు లేకుండానే సిక్కు కమ్యూనిటీని నిందిస్తూ తప్పుడు ట్వీట్ చేసినట్లు ఓజీసీ పేర్కొంది. అయితే ఆ ట్వీట్‌ను ప్రాంతీయ పోలీసులు తొలగించినట్లు వివరించింది.
సిక్కు సమాజానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం: ఓజీసీ
ఆస్ట్రేలియా, కెనడాలో జరుగుతున్న ఆలయాలపై దాడుల సారుప్యత నేపథ్యంలో సిక్కు సమాజాన్ని కించపరిచేలా ఒక నమూనా ఉద్భవించవచ్చని తాము విశ్వసిస్తున్నట్లు ఓజీసీ ప్రకటనలో తెలిపింది. ఆలయాలపై దాడులు భారత గూఢచార సంస్థల సూచనల మేరకు జరిగాయని అనుమానాలను వ్యక్తం చేసింది. భారతదేశంలోని తీవ్రవాద హిందుత్వ నాయకులకు అనుగుణంగా, కెనడాలోని బిజెపి మద్దతుదారులు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఓజీసీ పేర్కొంది. విదేశీయుల జోక్యంతో కెనడియన్ సంస్థలకు తక్షణ ముప్పు పొంచి ఉన్నందున, ఈ విధ్వంస ఘటనల వెనుక భారతీయ ఇంటెలిజెన్స్ లేదా దౌత్య సిబ్బంది ప్రమేయంపై క్షుణ్ణంగా విచారణ జరపాలని డిమాండ్ చేసింది.