Page Loader
ట్రంప్‌కు ఎదురుదెబ్బ; లైంగిక వేధింపుల కేసులో కారోల్‌కు 5మిలియన్ డాలర్లు చెల్లించాలని జ్యూరీ తీర్పు
ట్రంప్‌కు ఎదురుదెబ్బ; లైంగిక వేధింపుల కేసులో కారోల్‌కు 5మిలియన్ డాలర్లు చెల్లించాలని జ్యూరీ తీర్పు

ట్రంప్‌కు ఎదురుదెబ్బ; లైంగిక వేధింపుల కేసులో కారోల్‌కు 5మిలియన్ డాలర్లు చెల్లించాలని జ్యూరీ తీర్పు

వ్రాసిన వారు Stalin
May 10, 2023
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 1990లలో మ్యాగజైన్ రచయిత జీన్ కారోల్‌(79)పై ట్రంప్ లైంగికంగా వేధించాడని, ఆపై ఆమెను అబద్ధాలకోరుగా ముద్ర వేసి పరువు తీశారని అమెరికా జ్యూరీ మంగళవారం నిర్ధారించింది. ఈ కేసులో కారోల్‌కు డొనాల్డ్ ట్రంప్‌ 5 మిలియన్ డాలర్లు చెల్లించాలని జ్యూరీ ఆదేశించింది. ఈ మేరకు వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. జ్యూరీ తీర్పుపై కారోల్ స్పందించారు. ప్రపంచానికి చివరకు నిజం తెలిసిందన్నారు. ఈ విజయం తనది మాత్రమే కాదని, నమ్మకాన్ని కోల్పోయి బాధపడుతున్న ప్రతి మహిళదని చెప్పారు. జ్యూరీ తీర్పు 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ట్రంప్‌ను ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది.

అమెరికా

మళ్లీ అప్పీలు చేయనున్న ట్రంప్

ట్రంప్‌పై లైంగిక వేధింపులు లేదా వేధింపుల ఆరోపణలు చేసిన డజనుకు పైగా మహిళల్లో కారోల్ ఒకరు. మాన్‌హాటన్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లోని డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ తనపై అత్యాచారం చేశాడని కారోల్ 2019లో బహిరంగంగా వెల్లడించింది. ఈ క్రమంలో ట్రంప్ తనపై కారోల్ చేసిన ఆరోపణలను ఖండించారు. స్టోర్‌లో కారోల్‌ తనకు ఎప్పుడూ ఎదురుపడలేదని ట్రంప్ చెప్పారు. కారోల్ చెప్పిందంతా కట్టుకథగా ట్రంప్ కొట్టిపారేశారు. అంతేకాకుండా అమెను అబద్ధాల కోరుగా కారోల్‌ను చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే చివరికి జ్యూరీ ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. కారోల్‌ను సమర్ధించింది. అయితే ట్రంప్ మళ్లీ అప్పీలు చేస్తారని ఆయన న్యాయవాది జోసెఫ్ టాకోపినా మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్ట్‌హౌస్ వెలుపల విలేకరులతో అన్నారు.