
Pakistan:పాక్ పై బలోచ్ తిరుగుబాటుదారులు దాడి.. 6 నెలల్లో 286 దాడులు..700 మంది సైనికులు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్‌ఎ) పాకిస్థాన్ సైన్యాన్ని తీవ్రంగా వేధిస్తోంది. గత రెండు రోజుల్లోనే 27 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్టు ఈ సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని బిఎల్‌ఎ తమ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. బిఎల్‌ఎకి చెందిన ఫతే స్క్వాడ్, బలూచిస్తాన్‌లోని కలాత్ ప్రాంతంలోని నిమ్రాగ్ క్రాస్ వద్ద పాకిస్థాన్ సైనికులను తరలిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. ఈ దాడిలో 27 మంది సైనికులు మరణించగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ బస్సు కరాచీ నుంచి క్వెట్టాకు సైనిక దళాలను తరలిస్తుండగా, ఈ దాడి జరిగింది.
వివరాలు
గుజ్రోకొర్ ప్రాంతంలో దాడి.. ఆరుగురు సైనికులు హతం
అంతే కాకుండా, మరో దాడిలో బిఎల్‌ఎ క్వెట్టాలోని హజార్‌గంజ్ ప్రాంతంలో ఐఈడీ పేల్చి మరో ఇద్దరు సైనికులను హతమార్చినట్టు వెల్లడించింది. మంగళవారం రోజున కలాత్‌లోని ఖజినా ప్రాంతంలో మరో ఐఈడీ బాంబును పేల్చి నలుగురు సైనికులను చంపినట్టు పేర్కొంది. బుధవారం రోజున గుజ్రోకొర్ ప్రాంతంలో దాడి చేసి మరో ఆరుగురు సైనికులను హతమార్చినట్టు తెలిపింది. ఈ దాడుల్లో మేజర్ సయిద్ రబ్ నవాజ్ తరీక్ కూడా మృతిచెందినట్టు స్పష్టం చేసింది. దాడుల సమయంలో సమీపంలోని సైనిక కాన్వాయ్‌ను బిఎల్‌ఎ స్నైపర్లు లక్ష్యంగా చేసుకోవడంతో, ఆ కాన్వాయ్ వెంటనే వెనక్కు తగ్గిందని పేర్కొంది. అయితే, తమ సంస్థకు చెందిన ముగ్గురు సభ్యులు మృతిచెందినట్టు వచ్చిన వార్తలను బిఎల్‌ఎ ఖండించింది.
వివరాలు
మూడు ఆత్మాహుతి దాడులు.. 700 మందికి పైగా మరణించారు
గత ఆరు నెలల్లో బలోచ్ తిరుగుబాటుదారులు పాకిస్థాన్ మీద దాదాపు 286 దాడులు నిర్వహించారు. వీటిలో విభిన్నమైన వ్యూహాలను అవలంబించారు. ఇందులో మూడు ఆత్మాహుతి దాడులు కూడా ఉన్నాయి. బిఎల్‌ఎ చేపట్టిన దాడుల్లో ఇప్పటివరకు 700 మందికి పైగా మరణించారని పేర్కొంది. ఇంకా 290 మందిని బందీలుగా పట్టుకున్నట్టు వెల్లడించింది. వీటితో పాటు 133 వాహనాలను ధ్వంసం చేసిందని చెప్పింది. అంతేకాకుండా, ఓ రైలును కూడా హైజాక్ చేసినట్టు పేర్కొంది. ఈ ఏడాది మొత్తం 45 వ్యూహాత్మక ప్రదేశాలను పాకిస్థాన్ ప్రభుత్వ నియంత్రణ నుండి తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.