LOADING...
Nitai roy chowdhury: బంగ్లాదేశ్ కొత్త సర్కార్… మంత్రివర్గంలో ఏకైక హిందూ నేత నితై రాయి
బంగ్లాదేశ్ కొత్త సర్కార్… మంత్రివర్గంలో ఏకైక హిందూ నేత నితై రాయి

Nitai roy chowdhury: బంగ్లాదేశ్ కొత్త సర్కార్… మంత్రివర్గంలో ఏకైక హిందూ నేత నితై రాయి

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2026
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

నిన్న మంగళవారం ఢాకాలో బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రి తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దాదాపు 50 మంది మంత్రులు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ కార్యక్రమంలో భారత్ ప్రత్యేకంగా దృష్టి సారించిన అంశం ఒక్కటే. అది నితై రాయి చౌదరి. ఎందుకంటే నూతన మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక హిందూ నేత ఆయనే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో నితై రాయి చౌదరి రాజకీయ ప్రస్థానంపై ఆసక్తి నెలకొంది.

వివరాలు 

అల్లర్లలో తీవ్రంగా నష్టపోయిన మైనారిటీలు 

గత రెండేళ్లుగా బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత, హింసాత్మక ఘటనలతో అల్లాడిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితులకు ముగింపు పలుకుతూ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారీ విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. అయితే ఈ కాలంలో జరిగిన అల్లర్లలో మైనారిటీలే తీవ్రంగా నష్టపోయారు. మత ఛాందసవాదులు హిందువులపై దాడులు చేయడం, హత్యలకు పాల్పడడం, వారి ఆస్తులు, దేవాలయాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం హిందువుల భద్రత, హక్కుల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ పరిస్థితుల్లోనే తారిఖ్ రెహ్మాన్ తన మంత్రివర్గంలో హిందూ నేత నితై రాయి చౌదరికి స్థానం కల్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వివరాలు 

వ్యక్తిగత జీవితం

నితై రాయి చౌదరి 1949 జనవరి 7న జన్మించారు. ఆయన వివాహం జూమా అనే మహిళతో జరిగింది. వారికి ముగ్గురు సంతానం. వృత్తిరీత్యా నితై రాయి న్యాయవాది. ఆయన కుమారుడు దేబాసిష్ రాయ్ చౌదరి ప్రస్తుతం బంగ్లాదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. కుమార్తె నిపున్ రాయ్ చౌదరి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ బీఎన్‌పీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఆమె భర్త కూడా బీఎన్‌పీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మరో కుమారుడు మిథున్.

Advertisement

వివరాలు 

పొలిటికల్ కెరీర్

నితై రాయి చౌదరి తన ప్రయాణాన్ని క్షేత్రస్థాయి రాజకీయాల నుంచే ప్రారంభించారు. అంచెలంచలుగా ఎదుగుతూ జాతీయ స్థాయి నాయకుడిగా గుర్తింపు పొందారు. 1988లో తొలిసారి మాగురా-2 నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.అనంతరం 1990లలో మూడు నెలల పాటు యువజన, క్రీడా శాఖ మంత్రిగా సేవలందించారు. హుస్సేన్ మహ్మద్ ఎర్షాద్ పాలన అనంతరం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలో చేరిన ఆయన,పార్టీ ఉపాధ్యక్ష స్థాయి వరకు ఎదిగారు. ఒక దశలో పార్టీ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేస్తూ కీలక నిర్ణయాల్లో తన పాత్ర పోషించారు. అయితే గతంలో దేశ మాజీ ప్రధాని షేక్ హాసీనాను ఆయన బహిరంగంగా విమర్శించారు. ఆమె పాలన ఫాసిస్టు ధోరణిలో సాగుతోందని, నియంతృత్వ విధానాలు అవలంబించిందని ఆరోపించారు.

Advertisement

వివరాలు 

భారత్ సంబంధాలు

అలాగే 2001లో బీఎన్‌పీ కూటమి అధికారంలో ఉన్న సమయంలో హిందువులపై దాడులు జరిగాయని ఆమె ఆరోపణలు చేశారు. నితై రాయి చౌదరి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వ్యూహాత్మకంగా బంగ్లాదేశ్ భారత్‌కు ఎంతో కీలకమని, అందుకే భారత్ స్నేహాన్ని కోరుకుంటోందని తెలిపారు. అదే విధంగా బీఎన్‌పీ కూడా భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేయాలని భావిస్తోందని చెప్పారు. అయితే గతంలో మైనారిటీలపై జరిగిన దాడుల నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన రెహ్మాన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది వేచి చూడాల్సి ఉందన్నారు. మంత్రి హోదాలో ఉన్న నితై రాయి చౌదరికి కూడా దేశంలోని హిందువుల భద్రతపై కీలక బాధ్యత ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

వివరాలు 

భారత్- బంగ్లా సంబంధాలు

ఇక భారత్-బంగ్లాదేశ్ సంబంధాల విషయానికి వస్తే, బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రి తారిఖ్ రెహ్మాన్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌కు ఆహ్వానించారు. మంగళవారం ఢాకాలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ప్రభుత్వ ప్రతినిధిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. ప్రధాని మోదీ పంపిన వ్యక్తిగత లేఖను ఆయన స్వయంగా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో బంగ్లాదేశ్‌తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలని భారత్ కోరుకుంటోందన్న సంకేతం వెలువడింది. అయితే ఈ నేపథ్యంలో తారిఖ్ రెహ్మాన్ ప్రభుత్వం భారత్ పట్ల ఎలాంటి వైఖరి అవలంబిస్తుందో అన్నది ఇంకా చూడాల్సి ఉంది.

Advertisement