LOADING...
Bangladesh: బంగ్లాదేశ్‌లో శ్రీరాముడి భారీ విగ్రహ నిర్మాణానికి బ్రేక్.. మతపరమైన వ్యతిరేకతే కారణమా?
మతపరమైన వ్యతిరేకతే కారణమా?

Bangladesh: బంగ్లాదేశ్‌లో శ్రీరాముడి భారీ విగ్రహ నిర్మాణానికి బ్రేక్.. మతపరమైన వ్యతిరేకతే కారణమా?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2026
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో నిర్మాణంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరాముడి విగ్రహ ప్రాజెక్టుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. గైబాంధా జిల్లాలోని పలాష్‌బారి ప్రాంతంలో ఉన్న శ్రీశ్రీ రాధా గోవింద, కాళీ ఆలయ ప్రాంగణంలో ఈ భారీ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. అయితే స్థానిక మతపరమైన సంస్థలు, కొన్ని ఇస్లామిక్‌ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో నిర్మాణ పనులను ప్రస్తుతానికి నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఘటన బంగ్లాదేశ్‌తో పాటు అంతర్జాతీయంగానూ చర్చకు దారితీసింది. ముఖ్యంగా అక్కడి హిందూ మైనారిటీల మత స్వేచ్ఛ, భద్రత అంశాలపై మరోసారి చర్చ మొదలైంది. విగ్రహ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని మత సంస్థలు నిరసనలు చేపట్టడం, తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

వివరాలు 

మత స్వేచ్ఛ ప్రతి పౌరుడికి సమానంగా ఉండాలి: తస్లీమా నస్రీన్

ఈ పరిణామంపై ప్రవాస బంగ్లాదేశ్ రచయిత్రి,మానవ హక్కుల కార్యకర్త తస్లీమా నస్రీన్ స్పందించారు. బంగ్లాదేశ్‌లో లక్షలాది మసీదులు ఉండగా,కొత్త మసీదుల నిర్మాణం కూడా కొనసాగుతోందని,అలాంటి పరిస్థితుల్లో ఒక రామాలయం లేదా శ్రీరాముడి విగ్రహ నిర్మాణాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. మత స్వేచ్ఛ ప్రతి పౌరుడికి సమానంగా ఉండాలని,అది కేవలం మెజారిటీ వర్గానికే పరిమితం కాకూడదని అభిప్రాయపడ్డారు. పలాష్‌బారి ప్రాంతంలో గతంలో హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం జరిగిన ఘటనలను ప్రస్తావించిన తస్లీమా నస్రీన్.. తాజా పరిణామం హిందూ మైనారిటీల భద్రతపై మరిన్ని సందేహాలు రేకెత్తిస్తోందన్నారు. అలాగే ఇండోనేషియా,యూఏఈ,మలేషియా, ఒమన్ వంటి ముస్లిం మెజారిటీ దేశాల్లో కూడా పెద్ద హిందూ దేవాలయాలు ఉన్నాయని, వాటిని ఎవరూ దేశానికి ముప్పుగా పరిగణించరని వ్యాఖ్యానించారు.

వివరాలు 

ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేసిన సలాహుద్దీన్ షోయబ్ చౌధురి

ఇక బంగ్లాదేశ్‌కు చెందిన 'బ్లిట్జ్' పత్రిక సంపాదకుడు సలాహుద్దీన్ షోయబ్ చౌధురి కూడా ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక జిహాదీ, ఇస్లామిక్‌ అతివాద గ్రూపుల నిరసనల నేపథ్యంలోనే శ్రీరాముడి భారీ విగ్రహ నిర్మాణ పనులను నిలిపివేసినట్లు ఆయన ఆరోపించారు. ఈ పరిణామం బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గాల మతపరమైన హక్కులు, మత స్వేచ్ఛ, సామాజిక సామరస్యంపై మరోసారి చర్చకు దారితీసింది.

Advertisement