LOADING...
Sheikh Hasina: బంగ్లాదేశ్ అల్లర్ల కేసు.. మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చిన కోర్టు 
బంగ్లాదేశ్ అల్లర్ల కేసు.. మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చిన కోర్టు

Sheikh Hasina: బంగ్లాదేశ్ అల్లర్ల కేసు.. మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చిన కోర్టు 

వ్రాసిన వారు Jayachandra Akuri
ద్వారా సవరించబడింది Sirish Praharaju
Nov 17, 2025
02:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా (Sheikh Hasina)పై సాగిన విచారణలో ఆమె దోషిగా నిర్ధారణ అయ్యింది. ఈనేపథ్యంలో ఆమెకు గరిష్ఠ శిక్ష పడే అవకాశం ఉంది. మానవత్వానికి విరుద్ధమైన నేరాలు చేశారన్న ఆరోపణలతో ఆమెపై నమోదు చేసిన పలు కేసులపై విచారణ జరిపిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్‌ (ICT) సోమవారం తీర్పు వెలువరించింది. గత ఏడాది జులై-ఆగస్టు నెలల్లో జరిగిన ఉద్యమాల సందర్భంగా దాదాపు 1,400 మంది మరణించారని ఒక న్యాయమూర్తి వివరించారు. నిరసన చేస్తున్న ప్రజలను అణచివేయడానికి వారిపై కాల్పులు జరపాలని హసీనా ఆదేశించారని న్యాయస్థానం పేర్కొంది.

వివరాలు 

దర్యాప్తు నివేదికను చదివి వినిపించారు

తీర్పు వివరాల్లో మరో న్యాయమూర్తి వెల్లడించిన ప్రకారం, ఆగస్టు 5న ఢాకాలో జరిగిన నిరసనల సమయంలో ఆర్మీ కాల్పులు జరిపిందనీ, నిరసనకారులపై హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు ప్రయోగించాలని ఆమె ఆదేశించారని తెలిపారు. ఈ మేరకు దర్యాప్తు నివేదికను చదివి వినిపించారు. గాయపడిన వారిని చికిత్స అందించేందుకు కూడా అడ్డంకులు సృష్టించారని పేర్కొన్నారు. అధికారాన్ని కాపాడుకునేందుకు హసీనా బలప్రయోగానికి ఒడిగట్టారని కూడా వ్యాఖ్యానించారు. తీర్పు ఇవ్వడంలో ఆలస్యం జరిగి ఉంటే క్షమించాలని న్యాయమూర్తి అన్నారు. ఇదిలా ఉండగా, తీర్పు నేపథ్యంలో ఐసీటీ పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

వివరాలు 

"షూట్ ఎట్ సైట్" ఆదేశాలు

ఈ తీర్పు తరువాత బంగ్లాదేశ్, ముఖ్యంగా రాజధాని ఢాకాలో,హై అలర్ట్ ప్రకటించారు. వాహనాలను దహనం చేయడం, బాంబులు విసిరే ప్రయత్నం చేయడం వంటి చర్యలు ఎవరు చేసినా, వారిని కాల్చివేయాలంటూ ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జత్ అలీ ఆదేశాలు ఇచ్చారు. దేశం విడిచి భారత్‌కు వచ్చిన హసీనా విద్యార్థుల ఉద్యమాలతో పరిస్థితి పూర్తిగా కుదేలై, షేక్ హసీనా గత ఏడాది ఆగస్టు 5న ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకుని దేశం విడిచి భారత్ చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె న్యూ ఢిల్లీ ప్రాంతంలోని ఒక రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. అక్కడి నుంచి చాలాసార్లు సోషల్ మీడియా ద్వారా,ఇంకా కొన్ని జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ కనిపిస్తున్నారు.

వివరాలు 

షేక్ హసీనా స్పందన

తీర్పుకు ముందు కూడా తన దేశాన్ని ఉద్దేశించి సందేశం విడుదల చేశారు. ఎవరూ బాధపడొద్దని అవామీ లీగ్ కార్యకర్తలను కోరారు. ''నేను ఇంకా బ్రతికే ఉన్నాను..అలాగే ఉంటాను.ప్రజల కోసం నా పని తిరిగి ప్రారంభిస్తాను.వాళ్లు ఏ విధమైన తీర్పు ఇవ్వనివ్వండి. నాకు సంబంధం లేదు.. ప్రాణం ఇచ్చేది దేవుడే;ఆయనే తీసుకుంటాడు.ఆ వరకూ నా దేశ ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాను. ఈ దేశం కోసం నా తల్లిదండ్రులు,నా సోదరులను కోల్పోయాను.నా ఇల్లు దహనం చేశారు. గోనో భవన్‌ (ప్ర‌ధాన‌మంత్రి అధికారిక నివాసం) నా ఆస్తి కాదు. అది ప్రభుత్వానిది. నేను దేశం విడిచి వెళ్లిన తర్వాత అక్కడ దోపిడీలు జరిగాయి.దానిని కొందరు 'విప్లవం' అంటున్నారు.గూండాలు, ఉగ్రవాదులు విప్లవాన్ని తీసుకురాలేరు'' అని ఆమె మండిపడ్డారు.