Page Loader
Bangladesh: భారత్‌కు బంగ్లా లేఖ.. మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించండి
భారత్‌కు బంగ్లా లేఖ.. మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించండి

Bangladesh: భారత్‌కు బంగ్లా లేఖ.. మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించండి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 23, 2024
05:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి అప్పగించాల్సిందిగా బంగ్లాదేశ్ ప్రభుత్వం భారతదేశాన్ని దౌత్యమార్గంలో సంప్రదించినట్లు వెల్లడించింది. న్యాయ ప్రక్రియలో భాగంగా విచారణ కోసం హసీనాను తిరిగి తీసుకురావాలని బంగ్లాదేశ్ కోరుకుంటుందని, ఈ అంశంపై భారత ప్రభుత్వానికి అధికారిక లేఖ రాశామని విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహిద్ హొస్సేన్ తెలిపారు. అదే సమయంలో, బంగ్లా హోంశాఖ కూడా ఈ ప్రక్రియలో చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది. అవసరమైన చర్యలు చేపట్టాలని విదేశాంగ శాఖకు లేఖ రాశామని, ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోందని హోంశాఖ సలహాదారు జహంగీర్ ఆలమ్ తెలిపారు. వ్యక్తుల అప్పగింతపై భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం, హసీనాను స్వదేశానికి తిరిగి తీసుకురావడం సాధ్యమని పేర్కొన్నారు.

వివరాలు 

 షేక్ హసీనాకి అరెస్టు వారెంట్ జారీ

గతంలో బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల కారణంగా ఆగస్టు 5న షేక్ హసీనా దేశాన్ని వీడి భారత్‌లో ఆశ్రయం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆమెతో పాటు ఆమె మంత్రివర్గం, సలహాదారులు, సైనికాధికారులపై నేరారోపణలు నమోదు కావడంతో, ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) ఇప్పటికే అరెస్టు వారెంట్ జారీ చేసింది.