LOADING...
BAPS Temple: అమెరికాలో BAPS ఆలయంపై దాడి.. ఖలిస్థానీకి మద్దతుగా,భారత్‌కు వ్యతిరేకంగా ద్వేషపూరిత నినాదాలు
ఖలిస్థానీకి మద్దతుగా,భారత్‌కు వ్యతిరేకంగా ద్వేషపూరిత నినాదాలు

BAPS Temple: అమెరికాలో BAPS ఆలయంపై దాడి.. ఖలిస్థానీకి మద్దతుగా,భారత్‌కు వ్యతిరేకంగా ద్వేషపూరిత నినాదాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2025
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో మరోసారి వేర్పాటువాదులు అల్లర్లు సృష్టించారు. ఇండియానా రాష్ట్రంలోని జాన్సన్‌ కౌంటీలో ఉన్న అక్షర్‌ పురుషోత్తమ్‌ స్వామినారాయణ్‌ దేవాలయం (BAPS Temple)పై ఖలిస్థాన్‌ వేర్పాటువాదులు దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని 'ఎక్స్‌'లో హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ వెల్లడించింది. ఖలిస్థాన్‌ ఉద్యమానికి మద్దతుగా,అలాగే భారత్‌ను వ్యతిరేకిస్తూ దేవాలయ గోడలపై అనేక ద్వేషపూరిత నినాదాలు రాసినట్లు తెలిపింది. భక్తుల ఆధ్యాత్మిక భావాలను దెబ్బతీసే విధంగా జరిగిన ఈ విధ్వంసక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేసింది. దేవాలయ నిర్వాహకుల ప్రకారం,ఈ ఏడాది అమెరికాలోని హిందూ ఆలయాలపై ఇది నాలుగో దాడి. ఇకపై ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆలయం చుట్టూ భద్రతా ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ చేసిన ట్వీట్ 

వివరాలు 

దేవాలయాలపై జరుగుతున్న దాడులపై హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ ఆందోళన

ఘటనపై కేసు నమోదు చేసినట్లు, అలాగే ఇందులో భారత వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉందా అనే దిశగా దర్యాప్తు జరుగుతోందని స్థానిక పోలీసులు తెలిపారు. హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ ప్రకటనలో, యూఎస్‌లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆలయాలకు తగిన రక్షణ కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అక్కడి అధికారులను కోరింది. మార్చిలో కూడా దక్షిణ కాలిఫోర్నియాలోని ఒక ప్రముఖ హిందూ దేవాలయం ఇలాంటి దాడికి గురైన విషయం గుర్తుచేసింది.