Melania Trump: ట్రంప్ విజయంలో బారన్ మాస్టర్ స్ట్రాటజీ.. మెలానియా కామెంట్స్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా ఇంటర్నెట్‌లోనూ చర్చనీయాంశమైంది. ఈ విజయంలో ట్రంప్ కుమారుడు బారన్ ట్రంప్ కీలక పాత్ర పోషించినట్లు కాబోయే ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ వెల్లడించారు. ఓ ప్రముఖ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెలానియా మాట్లాడారు. ఎన్నికల్లో యువతను ఆకర్షించేందుకు బారన్ ఎంతో తోడ్పడ్డాడని, యువత టీవీ వంటి సంప్రదాయ మీడియా కన్నా ఫోన్లు, పాడ్‌కాస్ట్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నారని చెప్పారు. ఈ మార్పును బారన్ బాగా గుర్తించాడని పేర్కొంది. మెలానియా తన భర్త అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో వైట్‌హౌస్‌కు తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు.
బారన్ పై ట్రంప్ ప్రశంసలు
తన బృందం వైట్‌హౌస్‌లో అవసరమైన ఏర్పాట్ల కోసం పని చేస్తోందని, అవసరమైన సిబ్బంది ఎంపిక ప్రక్రియ కూడా మొదలైందని తెలియజేశారు. డొనాల్డ్ ట్రంప్ కూడా బారన్ పై ప్రశంసలు కురిపించాడు. అతను తన సీక్రెట్ వెపన్ లాంటివాడని, జనరేషన్ జీని ఆకట్టుకునే స్ట్రాటజీలలో బారన్ ఎంతగానో సహకరించాడని కొనియాడారు. డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించేందుకు సర్వం సిద్ధమవుతుండగా, బారన్, మెలానియా ఇద్దరూ మరింత చర్చనీయాంశమవుతున్నారు.