Bashar al-Assad: మాస్కోలో ఆశ్రయం పొందడం ఇష్టం లేక.. విడాకులు కోరిన సిరియా మాజీ అధ్యక్షుడి భార్య!
తిరుగుబాటుదారులు సిరియాలో ఆధిక్యం సాధించడంతో, అధ్యక్షుడు బషర్-అల్-అసద్ రష్యాలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో అసద్ వ్యక్తిగత జీవితం సంబంధించి కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన భార్య అస్మా విడాకులు కోరినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అసద్ భార్య అస్మా (Asma al-Assad) ఇంగ్లాండ్‌లోని లండన్‌లో సిరియన్ తల్లిదండ్రులకు జన్మించారు. ఆమె అక్కడే పెరిగి, 2000 సంవత్సరంలో 25 ఏళ్ల వయసులో సిరియాకు వచ్చి బషర్-అల్-అసద్‌ను వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె సిరియాలో మొదటి మహిళగా సేవలు అందించారు.
లండన్‌కు తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి
ఇటీవలి కాలంలో అసద్ తన కుటుంబంతో కలిసి రష్యాలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో, అస్మా తన భర్త నుంచి విడాకులు కోరుతూ రష్యా కోర్టుకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే, లండన్‌కు తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి కోరినట్లు సమాచారం. మాస్కోలో ఆశ్రయం పొందడం ఆమెకు ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బషర్-అల్-అసద్ సిరియాను 24 ఏళ్ల పాటు పాలించారు. తిరుగుబాటు దళాలు డమాస్కస్‌ను ఆక్రమించినప్పటికీ, దేశం విడిచిపెట్టాలని తాను ఎప్పుడూ భావించలేదని అసద్ ఇటీవల పేర్కొన్నారు. రష్యా బేస్ నుంచి పోరాటం కొనసాగించాలనుకున్నప్పటికీ, ఆ స్థావరంపై డ్రోన్ దాడులు జరగడంతో రష్యా సైన్యం తనను సురక్షిత ప్రాంతానికి తరలించిందని వెల్లడించారు.