బీబీసీ డాక్యుమెంటరీ: 'భారత్- అమెరికా భాగస్వామ్య విలువలు గురించి మాత్రమే తెలుసు'
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ విషయం ఇప్పుడు అంతర్జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే దీనిపై యూకే స్పందించగా, సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ బీబీసీ డాక్యుమెంటరీపై స్పందించారు. బీబీసీ డాక్యుమెంటరీ గురించి తనకు తెలియదని నెడ్ ప్రైస్ వ్యాఖ్యానించారు. భారత్-అమెరికా రెండు అభివృద్ధి చెందుతున్న, శక్తివంతమైన ప్రజాస్వామ్యాలుగా అమలు చేసే భాగస్వామ్య విలువలు గురించి మాత్రమే తనకు తెలుసనని పేర్కొన్నారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీసీ 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' పేరుతో రెండు ఎపిసోడ్లతో కూడిన డాక్యుమెంటరీని రూపొందించింది. ప్రస్తుతం మొదటి ఎపిసోడ్ విడుదల కాగా, కేంద్ర ప్రభుత్వం ఆ వీడియోపై నిషేధం విధించింది.
అమెరికా- భారత్ ప్రజల మధ్య విడదీయరాని అనుబంధం: నెడ్ ప్రైస్
భారత్- అమెరికా సంబంధాలపై కూడా ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా- భారత్ ప్రజల మధ్య విడదీయరాని అనుబంధం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య బలమైన రాజకీయ, ఆర్థిక సంబంధాలు ఉన్నాయన్నారు. భారత్‌లో జరిగిన పరిణామాలపై గతంలోనే తాము స్పందించినట్లు ఈ సందర్భంగా నెడ్ ప్రైస్ గుర్తు చేశారు. 2002లో గుజరాత్‌లోని గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక వర్గం రైలును తగలబెట్టి, 59 మంది హిందూ యాత్రికులను సజీవ దహనం చేశారు. అనంతరం గుజరాత్‌లో మతపరమైన అల్లర్లు చెలరేగగా, అప్పుడు ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు. ఈ మారణహోమంలో అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 1,050 మంది ప్రాణాలు కోల్పోయారు.