Rajnath Singh: అలర్ట్‌గా ఉండాలి.. పొరుగు దేశాల కవ్వింపు చర్యలపై హెచ్చరిక
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దేశ సరిహద్దుల్లో భారత సైన్యం పూర్తిగా అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు లేకపోవడం సైన్యం అప్రమత్తత వల్లనే జరిగిందని ఆయన తెలిపారు. అయితే, ఈ విషయంలో అలసత్వం చేయకూడదని, పొరుగు దేశాల నుంచి ఎప్పుడైనా కవ్వింపు చర్యలు రావచ్చని ఆయన హెచ్చరించారు. శనివారం విజయదశమి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఉన్న సుక్నా కాంట్‌ను సందర్శించిన ఆయన, అక్కడ ఆర్మీ జవాన్లతో కలిసి ఆయుధ పూజ నిర్వహించారు. ఆయుధ పూజ అనంతరం జవాన్లను ఉద్దేశించి మాట్లాడారు. రాజ్‌నాథ్ సింగ్, సరిహద్దుల్లో భారత సైన్యం సదా అప్రమత్తంగా విధులు నిర్వహిస్తోందని ప్రశంసించారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక 'దసరా'
దేశ భద్రత విషయంలో మరింత దృఢంగా నిలబడాలని సూచించారు. విజయ దశమి అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ అని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. తాము ఏ ఇతర దేశంపై దాడి చేయడం లేదని, ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే మన దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని ఎవ్వరైనా విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే, వారితో పోరాడటమే ఒక్కటే మార్గమని రాజ్‌నాథ్ సింగ్ తేల్చిచెప్పారు. ప్రస్తుత గ్లోబల్ పరిస్థితుల దృష్ట్యా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉండాలని చెప్పారు.