
పాకిస్థాన్ కు భారీ ఊరట.. 3 బిలియన్ల డాలర్లకు ఐఎంఎఫ్ అమోదం
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ కు భారీ ఉపశమనం లభించింది.
పాకిస్థాన్ కు 3 బిలియన్ల బెయిలౌట్‌ను ఐఎంఎఫ్ అమోదం తెలిపింది. దక్షిణాసియా దేశానికి సాయం చేయడానికి వెంటనే $1.2 బిలియన్లను పంపిణీ చేయనున్నట్లు ఐఎంఎఫ్ ప్రకటించింది.
గత నెలలోనే 3 బిలియన్ డాలర్ల రుణం మంజూరు చేస్తామని ఐఎంఎఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. నగదు కొరతతో ఉన్న దేశానికి ఈ ప్రకటనతో కొంత ఉపశమనం లభించింది.
మొదటి విడతగా డబ్బును పంపిణీ చేయడానికి ముందు బోర్డు ఆమోదం తెలిపింది.
Details
దేశ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాం : ప్రధాని
పాకిస్థాన్‌లో గతేడాది తీవ్రమైన వరదలు రావడంతో ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతింది. దీంతో చాలా కుటుంబాలు రోడ్డునపడ్డాయి.
విదేశీ రుణాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించేందుకు వచ్చే 24 నెలల్లో పాకిస్థాన్‌కు కనీసం 20 బిలియన్ డాలర్లు అవసరం. ఈ ఏడాది ప్రారంభంలో విదేశీ మారక నిల్వలు 4 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయాయి.
పాకిస్తాన్ ముస్లిం లీగ్ నేతృత్వంలో ప్రభుత్వం తన పదవీకాలాన్ని పూర్తి చేసే నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉంటుందని, పార్లమెంటరీ ఎన్నికలు అక్టోబరు-నవంబర్‌లో జరుగుతాయని, దేశీయంగా నిధులను సమకూర్చుకోవడం ద్వారా పాకిస్థాన్ IMF నుండి తదుపరి రుణాలను నివారించగలదని పాక్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ పేర్కొన్నారు.